ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడారు : చీమ శ్రీనివాస్

ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడారు :  చీమ శ్రీనివాస్
  •  రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి కృతజ్ఞత సభలు

బషీర్ బాగ్, వెలుగు :  తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం10 ఏళ్లు ఉద్యమకారుల పేరు ఎత్తకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 

ఉద్యమకారుల ఆవేదనను పట్టించుకున్న కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలతో ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్ ను చేర్చడం జరిగిందని, ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణను ప్రారంభించాలని కోరారు.  రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభలు నిర్వహిస్తుండగా.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తొలిసభలో ఉద్యమకారుడు , చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రజా ప్రభుత్వానికి ఉద్యమకారులందరూ అండగా ఉండి  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు