కెమికల్ మ్యాంగో దందా..గుట్టు రట్టు

కెమికల్ మ్యాంగో దందా..గుట్టు రట్టు
  •      రసాయనాలతో మాగబెడ్తున్న వ్యాపారులు
  •     మామిడి కాయల మధ్య కెమికల్ పౌడర్ ప్యాకెట్లు
  •     రెండు మూడు రోజుల్లోనే పండ్లుగా మార్చి మార్కెట్​లోకి సప్లై
  •     హోల్​సేల్ మార్కెట్లే అడ్డాగా బిజినెస్
  •     సిటీ టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులతో వెలుగులోకి
  •     ఐదు గోదాముల్లో నాలుగు క్వింటాళ్ల పండ్లు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కెమికల్స్ సాయంతో మామిడి కాయలను మాగబెడ్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హోల్​సేల్ మార్కెట్లే అడ్డాగా సాగుతున్న ఈ కెమికల్ మ్యాంగో దందాను గుట్టురట్టు చేశారు. సోమవారం నుంచి ఐదు గోదాములపై పోలీసులు దాడుల చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. రూ.12.61 లక్షలు విలువ చేసే నాలుగు క్వింటాళ్ల మామిడి పండ్లు, ఇథిలీన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటైలైడ్ కెమికల్​ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కెమికెల్ మ్యాంగో దందాకు సంబంధించిన కేసు వివరాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్​ఫోర్స్ డీసీపీ షర్మి పెరుమాల్ బుధవారం వెల్లడించారు. 

హోల్​సేల్ వ్యాపారులంతా కలిసి దందా

రంజాన్, వేసవి కాలం కావడంతో మామిడి పండ్లకు డి మాండ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పండ్ల వ్యాపారులు కెమికల్ మ్యాంగో దందాకు తెరలేపారు. హోల్​సేల్ వ్యాపారులంతా కలిసి గోదాములను అడ్డా గా చేసుకుని మామిడి కాయలను మాగబెడ్తున్నారు. ఇక్కడి మామిడి కాయలతో పాటు ఏపీ సహా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి గోదాముల్లో కెమికల్స్ సాయంతో పండ్లుగా మారుస్తున్నారు. 

మామిడి కాయలు పండ్లుగా మారాలంటే వారం కంటే ఎక్కువ టైమ్ పడుతుంది. ఇథిలీన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటైలైడ్ కెమికల్ పౌడర్ బాక్సులపై కొంత ఎత్తులో మామిడి కాయల ట్రేలు పెడ్తే.. నాలుగైదు రోజుల్లో పండ్లుగా మారుతాయి. కానీ.. ఇప్పుడున్న డిమాండ్​ను క్యాష్ చేసుకునేందుకు పెట్టెల్లో ఉన్న మామిడి కాయల మధ్యే డైరెక్ట్​గా కెమికల్ పౌడర్ ప్యాకెట్లు పెడ్తున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే కెమికల్ పవర్​కు కాయలు కాస్త పండ్లుగా మారిపోతున్నాయి. 

జ్యూస్‌‌‌‌ సెంటర్స్, స్ట్రీట్‌‌‌‌ వెండర్స్‌‌‌‌కి సప్లయ్‌‌‌‌

ఇథిలీన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటైలైడ్ కెమికల్స్​తో మాగబెట్టిన పండ్లను రిటైల్ మార్కెట్లు, జ్యూస్ సెంటర్స్, స్ట్రీట్ వెండర్స్​కు సప్లై చేస్తున్నారు. గోదాముల్లో పండ్లు స్టోరేజ్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో, కెమికల్స్ మధ్య కాయలను నిల్వ చేస్తున్నారు. ఇలాంటి గోదాములు పాత బస్తీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. టాస్క్​ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో వీటన్నింటిపై నిఘా పెట్టారు. హబీబ్​నగర్, సుల్తాన్​బజార్, చాదర్​ఘాట్, అఫ్జల్​గంజ్, భవానీ నగర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దాడులు చేశారు. గోదాముల నిర్వాహకులు రామేశ్వర్ (60), సయ్యద్ జోహార్ (36), సయ్యద్ మస్తాన్ (34), పండ్ల వ్యాపారులు ఇర్ఫాన్​ఖాన్ (36), మహ్మద్ హుస్సేన్ (47), సయ్యద్ అస్లామ్ (32), సయ్యద్ సాదుల్లా (32)ను అరెస్ట్ చేశారు. 

ఊపిరితిత్తుల వ్యాధి బారినపడ్తరు

మామిడి కాయలను కొందరు వ్యాపారులు కెమికల్స్​తో మాగబెడ్తున్నరు. ఈ పండ్లు తింటే చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారినపడ్తాం. ఇథిలీన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటైలైడ్ కెమికల్స్ వాడుతున్నరు. నిబంధనలు పాటించకుండా పండ్లు స్టోర్ చేస్తున్నరు. కెమికల్స్ మోతాదు మించితే నరాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలా ఆర్టిఫిషియల్​గా మాగబెడ్తున్న మామిడి కాయల గురించి తెలిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- దయానిధి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, హైదరాబాద్.