రీట్రైవ్ భూమిలో పులి సంచారం..సీసీ కెమెరాలతో నిఘా

రీట్రైవ్ భూమిలో పులి సంచారం..సీసీ కెమెరాలతో నిఘా
  • కర్జెల్లి రేంజ్​లో ఐదేండ్ల తర్వాత బెబ్బులి

కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్​లోని కర్జెల్లి రేంజ్​లో అటవీ శాఖ చేపట్టిన పోడు భూముల రీట్రైవ్​పై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. దిందా గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ నాటారు. కాగా పది రోజుల క్రితం ఈ ప్రాంతంలో పులి కదలికలను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. మహారాష్ట్రలోని చప్రాల వైల్డ్ లైఫ్ సాంచురీకి ఆనుకుని ఉన్న రేంజ్ కావడంతో వన్యప్రాణుల సంచారం ఎక్కువే. కానీ 2020 తర్వాత పులి మళ్లీ ఇటువైపు రాలేదు.

 ఈ క్రమంలో ప్రాణహిత నది  దాటి దిందా సమీపంలోని అడవీ ప్రాంతం గుండా బెబ్బులి బెజ్జూరు రేంజ్​లోని వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. కాగా పులి వచ్చిన ప్రాంతం ఇటీవల రీట్రైవ్ చేసుకున్న ప్రాంతం కావడంతో అటవీ శాఖ అధికారులు సంబురపడుతున్నారు. తమ కృషి ఫలించిందంటున్నారు. గతంలో పోడు భూములుగా ఉన్న చోట అడవీ అభివృద్ధి కోసం అధికారులు మొక్కలు నాటారు. 

ట్రెంచ్ లు తవ్వడం, నీటి కుంట తవ్వించి, నీటి లభ్యత కోసం సోలార్ మోటార్ సైతం ఏర్పాటు చేశారు. పోడు భూముల రీ ట్రైవ్​ను పకడ్బందీగా చేయడంతో ఈ ప్రాంతంలో మనుషుల అలజడి తగ్గింది. ఈ క్రమంలోనే అయిదేండ్ల తర్వాత పులి సంచరిస్తోందని, ఇది మంచి పరిణామమని కర్జెల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ పేర్కొన్నారు. పులికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.