మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల శివారులో దుర్గామాత విగ్రహం బయటపడింది. అక్కడే ప్రతిష్టించి గ్రామస్తులు పూజలు చేశారు. కొద్దిరోజుల కింద మంచిర్యాలకు సుమారు వందమంది సాధువులు వచ్చారు. స్థానిక పూజారి పవన్ కుమార్ శర్మ కోరిక మేరకు గోదావరి నదిలో ముల్కల్ల పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేశారు.
తిరిగి వస్తుండగా హైవే నుంచి పుష్కర ఘాట్ కు వెళ్లే రోడ్డులో పక్కన ఓ ప్రైవేట్ స్థలంలో అమ్మవారి విగ్రహం భూమి లోపల ఉందని తెలిపారు. దానికి పక్కనే పోచమ్మ టెంపుల్ కూడా ఉంది. ఆ ప్రదేశంలో సాధువులు పూజలు చేశారు. భూమిలో లోపల అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి గుడి నిర్మించి పూజలు చేస్తే గ్రామానికి మేలు జరుగుతుందని సూచించారు. దీంతో ముల్కల్ల గ్రామస్తులు పాత మంచిర్యాలకు చెందిన భూ యజమానిని సంప్రదించి సోమవారం జేసీబీతో తవ్వకాలు చేశారు. మీటర్ లోతులో అమ్మవారి రాతి విగ్రహం కనిపించింది. వెలికితీసి శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. ఆ ప్రదేశంలో గుడి నిర్మించేందుకు భూ యజమాని కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది.
