- ప్రసవ మరణాల కట్టడిలో నిర్మల్ టాప్
- రాష్ట్రంలోనే మొదటి స్థానం
- సత్పలితాలనిచ్చిన అమ్మ రక్షిత ప్రోగ్రాం
- మంత్రుల ప్రశంసలు
నిర్మల్, వెలుగు: ప్రసవ మరణాల కట్టడిలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 9 నెలల్లో 6,523 ప్రసవాలు జరిగితే.. 6,520 మంది క్షేమంగా ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమ్మ రక్షిత’ కార్యక్రమం ద్వారా ప్రసవ మరణాలను కట్టడి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా జిల్లా అధికారుల పనితీరును ప్రశంసిస్తూ మంత్రులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ప్రసవ మరణ రహిత జిల్లాగా..
2030 వరకు జిల్లాను ప్రసవ మరణాల విముక్తి జిల్లాగా మార్చేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందుకోసమే అమ్మ రక్షిత కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. నిర్మల్, బైంసాలోని ఏరియా హాస్పిటల్స్‌లో ‘మదర్ చైల్డ్’ సెంటర్లను ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ లను అందుబాటులోకి తెచ్చారు. గర్భిణులకు కౌన్సెలింగ్ చేయడం, మానసికంగా దృఢంగా మార్చడంతో పాటు వారికి ఎలాంటి పౌష్టికాహారం అందుతుందో తెలుసుకోవడం, పౌష్టికాహారానికి సంబంధించి సలహాలు ఇవ్వడంతో పాటు యోగా శిక్షణ ఇస్తున్నారు.
గర్భిణులకు ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారు. కార్డియాలజీకి సంబంధించిన టెస్ట్‌లను ప్రత్యేకంగా చేపడుతున్నారు. ఇలా గర్భిణులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి వారు డెలివరీ అయ్యే వరకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రసవ మరణాలు తగ్గుతున్నాయి.
అంతకుముందు ఇలా..
2024 డిసెంబర్ 14 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం అమలవుతోంది. అప్పటి నుంచి కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. కానీ అంతకుముందు 2020--2021లో 18 మంది, 2021-22లో 7, 2022- 23లో 4, 2023--24 లో 13 ప్రసవ మరణాలు జరిగాయి.
ఎక్స్‌లో మంత్రుల ప్రశంసలు
ప్రసవ మరణాల కట్టడిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ సత్ఫలితాలు సాధిస్తున్న నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డీఎంహెచ్‌వోతో పాటు వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రశంసించారు. వారిని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. అమ్మ రక్షిత ప్రోగ్రాంను కొనియాడారు.
