పేరుకే మినరల్ వాటర్ ప్లాంట్స్.. కానీ అంతా కెమికల్​!

V6 Velugu Posted on Sep 24, 2021

నిజామాబాద్​,  వెలుగు: పేరుకే మినరల్​ వాటర్​ ప్లాంట్స్​... కానీ అంతా కెమికల్స్​తోనే నడిపిస్తున్నారు. దీంతో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుక్కొని తాగుతున్న వారు రోగాల బారిన పడుతున్నారు. ప్లాంట్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 200  వాటర్ ప్లాంట్లు ఉండగా.. 90 శాతం ప్లాంట్లలో కనీస నిబంధనలు పాటించడం లేదు. బోరు వాటర్​ను సరిగ్గా ఫిల్టర్​ చేయకుండానే కెమికల్స్​ కలిపి సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇళ్లలోనే ఆర్వో వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్లలో నీటి నిల్వతో సమస్యలు వస్తున్నాయి. నీటి శుద్ధిలో రూల్స్​ అమలు కావడం లేదు. 

టీడీఎస్​ శుద్ధి చేయట్లే..

తాగే నీటిలో టోటల్ డిజాల్వ్​ సాల్వెంట్స్(టీడీఎస్​) 150 నుంచి 300 పీపీఎం మధ్యే ఉండాలి.  తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా నష్టమే. 150 పీపీఎం కంటే తక్కువగా ఉంటే మినరల్స్​ తగ్గిపోతాయి. 300 కంటే ఎక్కువగా ఉంటే యాసిడ్స్​ తగ్గిపోతాయి. కానీ చాలావరకు ప్లాంట్లను అమలుకావడం లేదు. టీడీఎస్​ను శుద్ధి చేయాలంటే అంతకు రెండు రెట్లు నీరు వృథాగా పోతుంది. శుద్ధి చేసిన నీటిలో తొలగించిన యాసిడ్స్​ వృథా నీటితో కలిసి బయటకు వస్తున్నాయి. అయితే ఈ నీటిని భూగర్భంలోకి పంపడం, డ్రైనేజీలకు కలపడం ప్రమాదకరం. ఈ వ్యర్థ నీటిని డ్రైబెడ్స్​లో కేక్‌‌గా మార్చి పారబోయాలి. ఇలా చేయాలంటే వాటర్​ ప్లాంట్లు విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయాలి. కానీ ఆర్వో ప్లాంట్లు ఇళ్ల మధ్యనే తక్కువ స్థలంలో ఏర్పాటు చేయడంతో ఇదంతా జరగడం లేదు.

ఐఎస్​ఐ గుర్తింపు ఉన్నవి పది లోపే..

జిల్లా వ్యాప్తంగా ఐఎస్ఐ గుర్తింపు ఉన్న ప్లాంట్లు పది లోపు మాత్రమే ఉన్నాయి. మిగతావి కేవలం ప్యూరీఫైర్ చేస్తూ  మినరల్ వాటర్ గా సప్లై చేస్తూ నడిపిస్తున్న ప్లాంట్లే. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం 250 గజాల స్థలంలో వాటర్ ప్లాంట్​ నిర్మాణం జరగాలి. ప్లాంటులో కెమికల్ బయోలాజికల్ ల్యాబులు ఏర్పాటు చేయాలి. నీటి స్వచ్ఛతను ప్రతిరోజు టెస్టు చేయాలి. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వాటర్ ప్లాంట్ల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఎస్ఐ నిబంధనలు, ట్రేడ్​మార్క్​ ఎక్విప్​మెంట్​తో వాటర్​ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే పర్మిషన్​ కలిపి రూ.6.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజు కింద రూ.లక్షా 25 వేలు కట్టాలి. ఇంత ఖర్చును తప్పించుకునేందుకు... కేవలం రూ.లక్షన్నర పెట్టి సాధారణ పరికరాలతో వాటర్​ ప్లాంటులు నెలకొల్పుతున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం వల్ల ఇవి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

Tagged NIzamabad, Chemicals, mineral water plants

Latest Videos

Subscribe Now

More News