ఫలితాలిస్తున్న కీమోథెరపీ ట్రీట్ మెంట్... సూర్యాపేటలో రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స

ఫలితాలిస్తున్న కీమోథెరపీ ట్రీట్ మెంట్... సూర్యాపేటలో రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స
  • సూర్యాపేటలో క్యాన్సర్ డే కేర్ సెంటర్‌‌లో రోజూ  6  నుంచి 8 మందికి కీమోథెరపీ
  • రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స

సూర్యాపేట, వెలుగు:  క్యాన్సర్ పేషెంట్ల కీమోథెరపీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఫలితాలు ఇస్తున్నాయి.  క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డ వారికి చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు చేయాలి.  హైదరాబాద్‌తో పాటు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి క్యాన్సర్‌ ట్రీట్మెంట్  పొందాల్సిన పరిస్థితి ఉండేది. 

అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి జిల్లాకో క్యాన్సర్‌ కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి రెండు నెలల క్రితమే సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ఆసుపత్రిలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించింది.  గతంలో క్యాన్సర్‌ పేషెంట్లు కీమోథెరపీ కోసం హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆస్పత్రికి వెళ్లేవారు.

 అన్ని జిల్లాల నుంచి క్యాన్సర్‌ బాధితులు ఈ ఆస్పత్రికే క్యూ కట్టడంతో..  కీమోథెరపీ కోసం పడిగాపులు కాసే పరిస్థితి. ఇందులో మార్పు తేవడం కోసం ప్రభుత్వం జిల్లాల్లోనే క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లను ప్రారంభించింది.  దీంతో ఇప్పుడు క్యాన్సర్‌ పేషెంట్లు వారి దగ్గర ప్రాంతంలోనే కార్పొరేట్‌ స్థాయి కీమోథెరపీ అందుతోంది.

ఎంఎన్‌జే లో క్యాన్సర్ నిర్దారణ అయ్యాకే  ట్రీట్మెంట్ 

క్యాన్సర్‌ లక్షణాలు ఉంటే ముందుగా వారు హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆస్పత్రికి వెళ్లాలి. అక్కడ క్యాన్సర్‌ నిర్ధారణ చేసి తొలిసారి చికిత్స చేస్తారు. ఆ తర్వాత నుంచి బాధితులు వారి కండిషన్‌ బట్టి జిల్లాలోని క్యాన్సర్‌ కేర్‌సెంటర్‌కు వెళ్తే అక్కడ వారికి కీమోథెరపీని అందిస్తారు. ఈ సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం నోడల్‌ అధికారిని నియమించింది. ఎంఎన్‌జే నుంచి లిస్ట్‌ రాగానే..  ఈ ఆఫీసర్లే స్వయంగా బాధితులకు కాల్‌ చేసి.. జిల్లా క్యాన్సర్‌ కేర్‌సెంటర్‌కు పిలుస్తున్నారు. ఇక్కడే చికిత్స తీసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు.

ఎనిమిది బెడ్లు ఏర్పాట్లు..

ఈ సెంటర్‌లో కేవలం కీమోథెరపీ మాత్రమే కాకుండా క్యాన్సర్‌ ట్రీట్మెంట్ కోసం అత్యవసరమైన 38 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజు వేసుకునే టాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ మాత్రమే కాక సెలైన్‌ ద్వారా ఎక్కించే ఖరీదైన కీమో ఇంజెక్షన్లు ఉన్నాయి. ట్రీట్మెంట్ చేయించుకునేందుకు వచ్చిన రోగులకు ఎనిమిది బెడ్లను అందుబాటులో ఉంచారు. వారితో వచ్చే అటెండర్లకు బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీరికి కూడా పౌష్టికాహారం అందిస్తున్నారు. 

అందుబాటులో ప్రత్యేక వైద్య సిబ్బంది..

క్యాన్సర్‌ పేషెంట్లకు వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించారు.  ఒక మెడికల్‌ఆఫీసర్, నలుగురు నర్సులు, ఇద్దరు ఫిజియోథెరఫిస్టులు, ఒక రేడియేషన్‌ అంకాలజిస్ట్ లను  కేటాయించారు. కార్పొరేట్‌ స్థాయిలో అందుతున్న ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.  

క్యాన్సర్‌ పేషెంట్లకు కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ 

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రెండు నెలల క్రితమే క్యాన్సర్‌  కేర్‌సెంటర్‌ను ప్రారంభించాం.  రోజుకు 6 నుంచి 8 మంది వరకు కీమో చేస్తున్నాం. అవసరమైన వారిని ఆసుపత్రిలోని ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కొందరిని సాయంత్రానికి ఇంటికి పంపిస్తున్నాం. కార్పొరేట్‌స్థాయిలో అందుతున్న ఈ సేవలను క్యాన్సర్‌ రోగులు సద్వినియోగం చేసుకోవాలి.  ఖరీదైన మందులు అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం 250 మందికి సరిపోను మందులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ ఎంఎన్‌జేలో నిర్ధారణ అయిన వారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందుతుంది.– శ్రవణ్‌కుమార్, ఆసుపత్రి  సూపరింటెండెంట్ 

రెండు నెలల్లోనే 30 మందికి ట్రీట్ మెంట్ 

2025 అక్టోబర్‌ చివరలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ కేర్‌సెంటర్‌ను ప్రారంభించారు. రోజు 6 నుంచి 8 మంది వరకు కీమోథెరఫీ చేస్తున్నారు. పేషెంట్ల నుంచి స్పందన వస్తోంది. రెండు నెలల్లోనే జిల్లా ఆసుపత్రి క్యాన్సర్‌ కేర్‌సెంటర్‌లో 30 మందికి పై కీమో సేవలు పొందారు. దీనివల్ల పేషెంట్లకు డబ్బు, సమయం ఆదా అవ్వడం మాత్రమే కాక, ప్రయాణం చేయాల్సిన బాధ తప్పింది.