కొబ్బరి చిప్పల్లో చాయ్ అమ్ముతుండు

కొబ్బరి చిప్పల్లో చాయ్ అమ్ముతుండు

పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు దీనా..  చెన్నైలో ఉంటడు. టక్కరిదొంగ సినిమాలో మహేష్ బాబు లాగే... నలుగురికి నచ్చినది.. తనకసలే నచ్చదనే రకం... ఏం చేసినా అందులో సంథింగ్ స్పెషల్ ఉండాలి అనుకుంటడు. అందుకే ఓ టీ షాపు పెట్టిండు. ఇందులో వెరైటీ ఏముందని అనుకోవచ్చు. ఇక్కడే  మనోడు తన టాలెంట్ చూపించి అందర్నీ ఫిదా చేసిండు. ,చాయ్ ను అందరిలాగా గ్లాసుల్లోనో, కప్పుల్లోనో కాకుండా కొబ్బరి చిప్పల్లో అమ్ముతుండు. ఐడియానే కాదు.. చాయ్  టేస్ట్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుంది. ఇంకేముంది. బిజినెస్ కూడా క్లిక్ అవ్వడంతో మనోడు ఇప్పుడు ఫుల్ పాపులర్ అయిండు. ఆరు నెలల క్రితం చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ఈ  టీ షాప్ పెట్టిన దీనా..  మొదట్లో  గ్లాసుల్లోనూ, కప్పుల్లోనూ  కాఫీ, టీ అమ్ముతుండేవాడు. 

 కానీ  పర్యావరణ అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కొబ్బరి చిప్పల్లో కాఫీ, టీ అందించాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేకంగా కొబ్బరి చిప్పలను తయారు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నాడు. రోజుకు దాదాపు 60- నుంచి 70 కప్పులను ఉపయోగిస్తున్నట్లుగా దీనా తెలిపాడు. అతనిలో మరో గొప్ప క్వాలిటీ కూడా ఉందండోయ్.. ప్రతి సోమవారం ఒక కప్పు బ్లాక్ కాఫీని కేవలం ఒక రూపాయికి మాత్రమే అందిస్తాడు.

" నేను బ్లాక్ కాఫీకి బానిసను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. మొదట్లో నేను దుకాణం ఏర్పాటు చేసినప్పుడు  బీచ్‌లో ఏమీ కొనలేని చాలా మందిని చూసినప్పుడు కనీసం ఒక్క రూపాయికి బ్లాక్ కాఫీ అయినా అందించాలని అనుకున్నాను" అని  దీనా తెలపాడు. దీనా రైటర్ కూడా.. సినిమాలంటే పిచ్చి. సినిమాలకు మాటలు రాయాలనే కోరిక అతనికి ఉందట.