
చెన్నై: ఇండియా నంబర్ వన్ గ్రాండ్ మాస్టర్, తెలుగు కుర్రాడు ఎరిగైసి అర్జున్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ మూడో ఎడిషన్ లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లో తోటి ఆటగాడు విదిత్ సంతోష్, డచ్ ప్లేయర్ అనిష్ గిరి నుంచి అతనికి కఠిన సవాల్‌కు ఎదురవనుంది. ఈసారి టోర్నమెంట్‌ను మాస్టర్స్, చాలెంజర్స్ అనే రెండు భాగాలుగా విభజించారు.
ప్రతీ విభాగంలో 10 మంది చొప్పున మొత్తం 20 మంది ప్లేయర్లు తొమ్మిది రౌండ్ల క్లాసికల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు. గత రెండు సీజన్లలో ఏడు రౌండ్లతో జరిగిన ఈవెంట్‌కు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈ టోర్నమెంట్‌లో ప్లేయర్లకు ఫిడే సర్క్యూట్ పాయింట్లు లభిస్తాయి. ఇవి 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అవ్వడానికి కీలకం. మాస్టర్స్ విభాగంలో 2800 ఫిడే రేటింగ్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన అర్జున్.. ఇండియాకే చెందిన నిహాల్ సరీన్, జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కీమర్ నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత సీజన్‌లో కీమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇండియా ప్లేయర్లు ప్రణవ్ వి, కార్తికేయన్ మురళి సత్తా చాటాలని చూస్తున్నారు. చాలెంజర్స్ సెక్షన్‌లో సీనియర్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి, హర్షవర్ధన్ జీబీ, అభిమన్యు పురానిక్, అధిబన్ భాస్కరన్ తదితరులు
బరిలో నిలిచారు.