పెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్‌కతాలకు ముప్పు

పెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్‌కతాలకు ముప్పు

వాషింగ్టన్‌ : పెరుగుతున్న సముద్రమట్టాల వల్ల ఆసియాలోని మెగా నగరాలపై పెను ప్రభావం పడుతుందని తాజా పరిశోధన తేల్చింది. పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు ఇదేరీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్‌కతా, మయన్మార్‌లోని యాంగాన్‌, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌, వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకు ముంపు ముప్పు పొంచి ఉంటుందని వివరించారు. సముద్రమట్టాల్లో సహజసిద్ధ హెచ్చుతగ్గులపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.

నీరు వేడెక్కడం వల్ల మంచు ఫలకాలు కరిగి, అధిక నీరు వచ్చి చేరుతుంది. సముద్ర వడిలో మార్పుల కారణంగా ఈ పెరుగుదల ప్రాంతాలవారీగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజా పరిశోధనలో ప్రపంచ వాతావరణానికి సంబంధించిన కంప్యూటర్‌ నమూనా, ప్రత్యేక గణాంక నమూనాతో విశ్లేషణ జరిపారు. అంతర్గత వాతావరణ వైరుధ్యాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సముద్రమట్టాలు 20-30 శాతం పెరుగుతాయని, ఫలితంగా వరద ముప్పు మరింత పెరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు 2006తో పోలిస్తే 2100లో మనీలాలో తీరప్రాంతంలో వరద ఘటనలు 18 రెట్లు పెరుగుతాయని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో అవి 96 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.