తమిళనాడులో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

తమిళనాడులో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు  తిరువళ్లూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. గత వారం రోజులుగా చెన్నైతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువల్లూరు జిల్లాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఆ జిల్లాల్లో రికార్డ్‌ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇంతటి వర్షపాతం 30 ఏళ్లలో ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పొన్నేరి, అవడి ప్రాంతాల్లో ఏకధాటిగా వానలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 13 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు . 

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా.. తమిళనాడులోని పలు రోడ్లు, ఇళ్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరువళ్లూరు. కాంచీపురంలో చెన్నై వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నవంబర్ 12 ఉదయం వరకు ఇది వాయువ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడు -పుదుచ్చేరి, కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ పేర్కొంది.