వ్యాలెట్ పార్కింగ్ కోసం.. కొత్త కారు రైడింగ్ కు వెళ్లి యాక్సిడెంట్ చేశాడు

వ్యాలెట్ పార్కింగ్ కోసం.. కొత్త కారు రైడింగ్ కు వెళ్లి యాక్సిడెంట్ చేశాడు

చెన్నై ఆళ్వార్‌పేటలోని కస్తూరి రంగా రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేసే ఒక ఉద్యోగి, అక్టోబర్ 15న రాత్రి, కేథడ్రల్ రోడ్‌లో వెళుతున్న మరో కారును ఢీకొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెస్టారెంట్ ఉద్యోగి కొత్త కారును చాలా ర్యాష్ గా నడపడం వల్ల అది మీడియన్‌పైకి దూసుకువెళ్లింది. దీంతో రెయిలింగ్ పూర్తిగా ధ్వంసమైంది.

ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న అశోక్ నగర్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు.. కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కోసం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని తనిఖీ చేశారు.

కాళీరాజ్ అనే ఉద్యోగి ఆళ్వార్‌పేటలోని కస్తూరి రంగా రోడ్డులోని 3వ వీధిలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని సిటీ ట్రాఫిక్ పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్ కారును కాళీరాజ్ పార్క్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, కారును సమీపంలోని స్ట్రీట్ లో పార్క్ చేయకుండా, కాళీరాజ్ కారును కేథడ్రల్ రోడ్డు వైపు నడిపాడు. కారును నిర్లక్ష్యంగా నడపడంతో మొదట ఓ కారును ఢీకొట్టి, ఆపై మీడియన్‌ను ఢీకొట్టి దానిపై నుంచి దూసుకువెళ్లింది.

ఈ ఘటనలో కాళీరాజ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో రద్దీగా ఉండే కేథడ్రల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అశోక్ నగర్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.