లక్నో సూపర్ జైయింట్స్‌తో జరుగుతోన్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ కార్తీక్ శర్మ (71) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో దూబే (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాటర్స్ సంజు శాంసన్ (20), బ్రేవిస్ (25) ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్ మూడు వికెట్లతో చెలరేగగా.. షమీ, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
కార్తీక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. యంగ్ బౌలర్ ఆకాష్ సింగ్ చెన్నైకు ఆదిలోనే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (13), సంజు శాంసన్ (20), ఉర్విల్ పటేల్ (6)ను ఔట్ చేశాడు. ఆకాష్ సింగ్‌తో పాటు లక్నో బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో చెన్నై 37 పరుగులు మాత్రమే చేసింది.
ఈ దశలో జతకట్టిన కార్తీక్ శర్మ, డేవాల్డ్ బ్రేవిస్ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బ్రేవిస్ (25)ను ఔట్ చేసి ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని మహ్మద్ షమీ విడదీశాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా కార్తీక్ శర్మ మాత్రం దూకుడు తగ్గించలేదు. 42 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 71 రన్స్ చేసి వెనుదిరిగాడు. చివర్లో ప్రశాంత్ వీర్ (13)తో కలిసి శివమ్ దూబే (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు దూబే. దీంతో చెన్నై 180 పరుగుల మార్క్ చేరుకుంది.
