CSK vs RR: దూబే, బ్రేవీస్ మెరుపులు.. రాజస్థాన్‌కు మరోసారి ఛేజింగ్ టెన్షన్!

CSK vs RR: దూబే, బ్రేవీస్ మెరుపులు.. రాజస్థాన్‌కు మరోసారి ఛేజింగ్ టెన్షన్!

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. సోమవారం (మే 20) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్ ను రాజస్థాన్ ముందు ఉంచింది. 78 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరినా బ్రేవీస్ (42), దూబే (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో  యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మద్వల్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. తుషార్ దేశ్ పాండే, వానిందు హసరంగా తలో వికెట్ తీసుకున్నారు.   

ALSO READ |    IPL 2025: బెంగళూరు బ్యాడ్‌లక్.. RCB, సన్ రైజర్స్ మ్యాచ్‌కు వేదిక మార్చిన బీసీసీఐ

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్ లోనే యుధ్ వీర్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి చెన్నైకి బిగ్ షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్ నాలుగో బంతికి కాన్వే (10).. చివరి బంతికి ఉర్విల్ పటేల్(0) ఔటయ్యారు. కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును ఆయుష్ మాత్రే ముందుకు తీసుకెళ్లాడు. యుధ్ వీర్ వేసిన నాలుగో ఓవర్ లో 24 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మాత్రే విజృంభణతో చెన్నై పవర్ ప్లే లో 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. 

కోలుకున్నట్టు కనిపించిన సూపర్ కింగ్స్ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మంచి టచ్ లో ఉన్న మాత్రే 43 పరుగులు చేసిన ఔట్ కావడంతో పాటు అశ్విన్ (13), జడేజా (1) తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరారు. దీంతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దూబే, బ్రేవీస్ అద్భుతంగా ఆడారు. కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి చెన్నైను పటిష్ట స్థితికి చేర్చారు. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న బ్రేవీస్ బౌండరీలతో రెచ్చిపోయాడు. ఆతర్వాత దూబే కూడా రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు శరవేగంగ ముందుకెళ్లింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోర్ ను 200 పరుగులు చేయకుండా ఆపగలిగారు.