
చెన్నై మహిమ ఎందాకా?
నాలుగో టైటిల్‌పై సీఎస్‌కే గురి
పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్.. ఓసారి సెమీస్… మరోసారి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్రయాత్ర ఇది..! స్పాట్ ఫిక్సింగ్ మకిలి అంటుకున్నా… రెండేళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా… ఆట పరంగా మాత్రం సీఎస్‌కే స్థాయి ఎవరెస్ట్ ..! మిగతా ఫ్రాంచైజీల మాదిరిగా వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్ ప్లేయర్లు లభించక పోయినా.. యంగ్ గన్స్ అండ దొరకకపోయినా… కేవలం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల ఎక్స్పీరియెన్స్తోనే టైటిల్స్‌ను కొల్లగొట్టడం చెన్నై స్పెషాలిటీ..! మరీ ముఖ్యంగా కూల్ కెప్టెన్ మహేంద్రుడి మాయాజాలం.. చెన్నైకి అన్నిటింకంటే పెద్ద మహిమ..! మరి ఈసారి యూఏఈ గడ్డపై ఆ ‘మహి’మ పని చేస్తుందా? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా ఐపీఎల్ బరిలో నిలిచిన ధోనీ చెన్నైకి నాలుగో టైటిల్ అందిస్తాడా? చూడాలి..!!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్‌కింగ్స్‌కు అతిపెద్ద ఆకర్షణ మహేంద్ర సింగ్ ధోనీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానించే ఆటగాడు. పదేళ్లుగా సీఎస్‌కే భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. 2008 నుంచి నేటి వరకు ఆ స్థాయిలో టీమ్‌ను శాసించే వ్యక్తిగానీ, ప్లేయర్‌గానీ సీఎస్కేతోపాటు ఇతర ఫ్రాంచైజీలో లేడంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చెన్నై ఫ్రాంచైజీ.. కర్త, కర్మ, క్రియ అతనే. ఓనర్లు డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలనే విషయం కూడా ఎంఎస్ కనుసన్నల్లోనే జరుగుతుందంటే ధోనీపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ వెలుగు వెలిగిన మహీ.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అతను ఎలా ఆడినా ఏం చేసినా ఫ్యూచర్ గురించి మాట్లాడే వారు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ధోనీ చేసే ప్రతి పని, ఆడే ఆట, తీసుకునే నిర్ణయం మొత్తం చెన్నైకే చెందుతాయి.
బలం..
సీఎస్‌కే బలం మొత్తం ధోనీ. ఇందులో సందేహమే లేదు. ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నా.. గ్రౌండ్లో ధోనీ వ్యూహాలపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్‌రౌండర్ల జట్టు. బాగా నమ్మకం పెట్టుకోదగిన ప్లేయర్లు వాట్సన్, డుప్లెసిస్, రాయుడు అండగా ఉండటం కలిసొచ్చే అంశం. ఎంతటి ఒత్తిడిలోనైనా ఈ త్రయం పరుగులు రాబట్టడంలో దిట్టలు. మురళీ విజయ్ ఓపెనర్‌గా వెళ్లినా.. కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్ మిడిలార్డర్ కూడా బాగానే ఉంది. వీళ్లకు తోడు సూపర్ ఫినిషర్ ధోనీ ఉండనే ఉన్నాడు. ఓ ఐదు ఓవర్లు మహీ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ పరిస్థితి మొత్తం తారుమారు అవుతుందనడంలో సందేహం లేదు. ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో.. సీఎస్‌కే అమ్ములపొదిలో వజ్రాయుధాలు. బ్రావోను ధోనీ ఉపయోగించుకున్నంత తెలివిగా విండీస్ టీమ్ కూడా సద్వినియోగం చేసుకోలేదు. బౌలింగ్ కాంబినేషన్స్ కూడా చాలా ఉండటం అనుకూలాంశం. వాట్సన్, బ్రావో, హేజిల్‌వుడ్, సామ్ కరణ్, ఎంగిడితో పేస్ అటాక్ బలంగా కనిపిస్తున్నది. శార్దూల్ ఠాకూర్, చహర్, కేఎమ్ ఆసిఫ్, మోను కుమార్ అండగా నిలిస్తే చెన్నైకి తిరుగుండదు. స్పిన్‌లో ఇమ్రాన్ తాహిర్, కర్ణ్ శర్మ, జడేజా కీలకం.
బలహీనత..
ధోనీ, వాట్సన్ బ్యాటింగ్ చేసి చాలా కాలమైంది. వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ లేకపోవడం ప్రతికూలాంశం. ఈ ఇద్దరిలో ఒక్కరున్నా సీఎస్‌కే బలం రెట్టింపు అయ్యేది. యూఏఈలో అన్ని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమనే వార్తల నేపథ్యంలో భజ్జీ ఉంటే బాగుండేది. రైనా గైర్హాజరీతో నెంబర్–3 ఖాళీగా కనిపిస్తున్నది. ఇక టీమ్‌లో లెఫ్టాండ్ బ్యాట్స్‌మెన్ లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. జట్టులో చాలా మంది వయసు 30కి పైగానే ఉంది. వీళ్లందరూ గాయాలబారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉండటం. బౌలర్లు ఎక్కువగా ధోనీపైనే ఆధారపడటం. కరోనా కారణంగా సరైన ప్రిపరేషన్స్ లేకపోవడం కూడా బలహీనతగా మారింది.
జట్టు
బ్యాట్స్‌మెన్: మురళీ విజయ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్
ఆల్‌రౌండర్స్: డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, సామ్ కరన్, కేదార్ జాదవ్, కర్ణ్ శర్మ, కేఎమ్ ఆసిఫ్
వికెట్ కీపర్లు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), ఎన్. జగదీషన్
బౌలర్లు: దీపక్ చహర్, ఇమ్రాన్ తాహిర్, లుంగి ఎంగిడి, శాంట్నర్, మోను కుమార్, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, హేజిల్‌వుడ్, ఆర్. సాయి కుమార్.
ఐపీఎల్ రికార్డ్
మ్యాచ్‌లు: 165
విజయాలు: 100
ఓటములు: 63
నో రిజల్ట్ / టై: 1/1
బెస్ట్ పెర్ఫామెన్స్: మూడుసార్లు విన్నర్ (2010, 2011, 2018)
For More News..