- బౌలింగ్‌లో రాణించిన రబాడ
- రుతురాజ్ శ్రమ వృథా
చెన్నై: ఐపీఎల్–19లో రెండు వరుస పరాజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ గాడిలో పడింది. ఛేజింగ్‌లో సాయి సుదర్శన్ (46 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా.. మిగతా వాళ్లు నిరాశర్చారు. తర్వాత గుజరాత్ 16.4 ఓవర్లలో 162/2 స్కోరు చేసి నెగ్గింది. జోస్ బట్లర్ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 39 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (23 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. మూడు వికెట్లు తీసిన రబాడాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రుతురాజ్ మినహా..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యారు. బంతి బాగా బౌన్స్ అవుతుందని తెలిసినా భారీ షాట్లకు యత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. దీనికి తోడు గుజరాత్ బౌలర్లు రబాడ (3/25), సిరాజ్ (1/23), అర్షద్ ఖాన్ (2/43) క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో రన్స్‌ను కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో రుతురాజ్ నిలకడగా ఆడినా.. ఐదు ఓవర్లు ముగియకముందే శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0) పెవిలియన్‌కు చేరారు. దాంతో పవర్‌ప్లేలో సీఎస్కే 28/3 స్కోరే చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న హిట్టర్ బ్రెవిస్ (2) కూడా నిరాశపర్చడంతో చెన్నై 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో వచ్చిన శివమ్ దూబే (22)కు మూడుసార్లు లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐదో వికెట్‌కు 59 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో రుతురాజ్ 49 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో కార్తీక్ శర్మ (15), జెమీ ఓవర్టన్ (18) కాసేపు బ్యాట్లు అడ్డేశారు. కానీ భారీ షాట్లు ఆడలేకపోవడంతో సీఎస్కే పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఆరో వికెట్‌కు 26 రన్స్ జత చేసి కార్తీక్, ఏడో వికెట్‌కు 19 రన్స్ జోడించి ఓవర్టన్ వెనుదిరిగారు. మానవ్ సుతార్ ఒక వికెట్ తీశాడు.
టాప్ లేపారు..
చిన్న ఛేజింగ్‌లో గుజరాత్ టాప్ ఆర్డర్ మెరుపులు మెరిపించింది. తొలి ఓవర్‌లో 4, 6తో టచ్‌లోకి వచ్చిన ఓపెనర్ సుదర్శన్ మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లతో జోరు పెంచాడు. గిల్ స్ట్రయిక్ రొటేట్ చేసి అండగా నిలిచాడు. తర్వాతి రెండు ఓవర్లలో సుదర్శన్ మూడు ఫోర్లు, గిల్ సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో జీటీ 55/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో నూర్ అహ్మద్ (1/29) దెబ్బకు గిల్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 58 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ దశలో వచ్చిన బట్లర్ నిలకడగా ఆడాడు. దాంతో ఫస్ట్ టెన్‌లో గుజరాత్ 82/1 స్కోరు చేసింది. ఆ వెంటనే సుదర్శన్ 4, 6తో 33 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచిన సుదర్శన్, బట్లర్ సిక్స్, ఫోర్లు దంచారు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 138/1కి చేరింది. 16వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన సుదర్శన్‌ను 17వ ఓవర్‌లో అకీల్ హుస్సేన్ (1/46) ఔట్ చేశాడు. రెండో వికెట్‌కు 97 రన్స్ జతయ్యాయి. చివర్లో బట్లర్ సిక్స్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
- చెన్నై: 20 ఓవర్లలో 158/7 (రుతురాజ్ 74 నాటౌట్, శివమ్ దూబే 22, రబాడ 3/25).
- గుజరాత్: 16.4 ఓవర్లలో 162/2 (సుదర్శన్ 87, బట్లర్ 39 నాటౌట్, నూర్ అహ్మద్ 1/29).

