
మంచిర్యాల జిల్లా: సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్ళానని, కొత్త గనులు తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని మందమర్రిలో ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
బొగ్గు నిల్వలు లేవని బొగ్గు గనులు మూసివేస్తూ కొత్త గనులు తీసుకు రాకపోతే కార్మికుల శాతం తగ్గుతుందని, బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిందని సీఎండీ తనతో అన్నారని ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి సంస్థకు అలాట్మెంట్ అయిన గనులకు కేంద్ర ప్రభుత్వానికి 18 శాతం టాక్స్ సింగరేణి సంస్థ చెల్లిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
మందమర్రి మున్సిపాలిటీలో సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్స్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాలని ప్రజలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. కాలనీలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మందమర్రి అంగడిబజార్ ప్రాంతంలో శివ కేశవ ఆలయ కమాన్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు బండి శంకర్ను కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మందమర్రి మండల వ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు.