క్రమశిక్షణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మారు పేరు: వివేక్ వెంకటస్వామి

క్రమశిక్షణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మారు పేరు: వివేక్ వెంకటస్వామి
  • శ్రీసాయి విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజీ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

సికింద్రాబాద్, వెలుగు: క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో శ్రీసాయి విజ్ఞాన్ భారతి జూనియర్, డిగ్రీ మహిళా కాలేజీ 32వ వార్షికోత్సవం నిర్వహించారు. 

దీనికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘క్రమశిక్షణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మారుపేరు. అక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సీఈఓల్లో ఐదుగురు హెచ్ పీఎస్ నుంచే ఉన్నారు” అని చెప్పారు. విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని కష్టపడాలని సూచించారు. ‘‘నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పటికీ డాక్టర్​గా ప్రాక్టీస్ చేయలేదు. 

నాకు ఉన్న ప్యాషన్​తోనే వ్యాపార రంగం, రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రంగాలపై ఉన్న మక్కువ, పాఠశాల స్థాయిలో అలవర్చుకున్న క్రమశిక్షణ సక్సెస్ కావడానికి దోహదపడ్డాయి. ప్రతి విద్యార్థికి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలనే లక్ష్యం ఉండాలి. దానిని చేరుకోవడానికి  క్రమశిక్షణ ఎంతగానో  దోహదపడుతుంది” అని అన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సాయిబాబా, చైర్మన్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రమాదేవి, నిర్మల పాల్గొన్నారు.