నా పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకునేది లేదు

నా పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకునేది లేదు
  • చట్ట విరుద్ధమైన పనులకు ఎప్పుడూ వ్యతిరేకమే: వివేక్‌‌ వెంకటస్వామి
  • జర్నలిస్ట్‌‌పై దాడి చేయడం హేయమైన చర్య
  • ప్రభుత్వ రూల్స్‌‌ ప్రకారమే ఇసుక రవాణా చేయాలి
  • చెన్నూరులో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే 

కోల్​బెల్ట్, వెలుగు:  చట్ట విరుద్ధమైన పనులకు తానెప్పుడూ వ్యతిరేకమేనని, తన పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకునేది లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. నియోజకవర్గంలో బియ్యం, లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియా దందాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరులో విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ఘటనతో తనకు ఏం సంబంధం లేదని చెప్పారు. 

కానీ కొంతమంది కావాలనే తనను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బియ్యం దందాలో తన ప్రమేయం ఉందని తప్పుడు వార్తలు రాయడం సరికాదని, తాను అవినీతి, అక్రమాలను సహించబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి, అక్రమాలు జరిగితే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. ఈజీఎస్ కింద ఇసుకను తరలించేందుకు కొందరు తన పేరును వాడుకుంటున్నారని, అలాంటి వాటిని తాను ఎంకరేజ్‌‌ చేయనని చెప్పారు. సర్కార్ రూల్స్ ప్రకారమే అందరూ నడుచుకోవాలని సూచించారు. ట్యాక్స్‌‌లు కట్టిన వెహికల్స్‌‌ ద్వారానే ఇసుక రవాణా చేయాలని, పర్మిషన్ లేని వాహనాలను సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. 

క్యాంపు ఆఫీసులో అందుబాటులో ఉంటా..

చెన్నూరులో క్యాంపు ఆఫీస్‌‌లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి విన్నవించాలని సూచించారు. బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో ప్రజలు సీఎంను కలవకుండా, సమస్యలు చెప్పకుండా ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌‌ను ప్రజా భవన్‌‌గా మార్చి, ఇనుప కంచెలు తొలగించి ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడా అవినీతికి చోటు ఉండదని ఆయన పేర్కొన్నారు.

కుటుంబంతో కలిసి వివేక్ ప్రత్యేక పూజలు

చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా వివేక్ వెంకటస్వామి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వివేక్‌‌, ఆయన భార్య సరోజ, కుమారుడు వంశీకృష్ణ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రత పూజలో పాల్గొన్నారు. క్యాంపు ఆఫీసు ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి, జిల్లా, నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సహపంక్తి భోజనాలు నిర్వహించారు.