
ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌దేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కీంలలో వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ అని, బీజేపీ గెలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారన్నారు. వంశీని గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామికి పెద్దపల్లి పార్లమెంటుకు 70 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. కార్మికులకు పింఛన్, పేదలకు రేషన్ కార్డులు వచ్చేందుకు కాకా కృషి చేశారని తెలిపారు.
గతంలో 75 వేల మంది ఇండ్లు లేని వాళ్లకు హైదరాబాద్‌లో గుడిసెలు వేయించి వారికి పట్టాలు ఇప్పించారన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు మారుతాయని, తొలి ఉద్యమంలో బుల్లెట్లకు కాకా ఎదురు నిలిచి పోరాడారని చెప్పారు. రామగుండంలో ఉన్న ఎఫ్‌సీఐకి రూ.10 వేల కోట్లు రుణమాఫీ చేయించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామిదేనన్నారు. మూతపడ్డ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను తిరిగి ప్రారంభించడంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గాన్ని దోచుకుంటే.. బీజేపీ ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గానికి అవసరమైన పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మించి తీరుతామన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో ప్రజల గొంతునవుతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు.