కేటీఆర్ కాళేశ్వరం టూర్.. పబ్లిసిటీ స్టంట్: వివేక్ వెంకటస్వామి

కేటీఆర్ కాళేశ్వరం టూర్.. పబ్లిసిటీ స్టంట్: వివేక్ వెంకటస్వామి

 

  • చేసిన తప్పులకు క్షమించాలని పూజలు చేయడానికి వచ్చినట్టుంది:  వివేక్ వెంకటస్వామి
  • ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు అనడం హాస్యాస్పదం
  • మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోస్తే మళ్లీ కిందికి వదలాల్సిందే..
  • అట్ల చేసే బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేల కోట్ల కరెంట్ బిల్లులు వృథా చేసిన్రు
  • పంటలు మునగకుండా గోదావరికి కరకట్టలు కడతామని వెల్లడి

మంచిర్యాల, వెలుగు:  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​పబ్లిసిటీ కోసమే పార్టీ నేతలతో కలిసి కాళేశ్వరం టూర్​కు వచ్చారని చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘కేటీఆర్​మేడిగడ్డ విజిట్​కు వచ్చినట్టు లేదు. గత పదేండ్లలో చేసిన తప్పులకు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేయడానికి వచ్చినట్టుంది’’ అని ఎద్దేవా చేశారు. ఆయనకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​వాటర్​తో పంటలు మునిగి నష్టపోయినోళ్లను కలిసి, వాళ్ల గోడు వింటే బాగుండేదని అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో వివేక్ మాట్లాడారు. కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆయన అన్నారు. ‘‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూపొందించింది. దానికి రూ.11 వేల కోట్లు కూడా ఖర్చు చేసింది. కానీ కేసీఆర్​సీఎం అయ్యాక కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్​చేసి కాళేశ్వరం కట్టిండు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిండు. అందులో వేల కోట్ల కమీషన్లు తీసుకున్నడు. కాళేశ్వరం కాంట్రాక్టర్​ను ప్రపంచంలోనే ధనవంతుడిని చేసిండు. అందుకే ఆ కాంట్రాక్టర్ బీజేపీ, బీఆర్ఎస్​లకు ఎలక్టోరల్​బాండ్ల రూపంలో రూ.500 కోట్లు ఇచ్చిండు” అని చెప్పారు. బీఆర్ఎస్​అవినీతి పాలనతో విసిగిపోయిన జనం.. గత అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. 

వరద వస్తున్నప్పుడు ఎత్తిపోసుడు ఎందుకు? 

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోస్తే మళ్లీ కిందికి వదలాల్సిందేనని వివేక్​అన్నారు. ‘‘ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు. ప్రస్తుతం 17.50 టీఎంసీల నీళ్లు ఉన్నయ్. గోదావరిలో వరద వస్తుండడంతో వచ్చిన నీళ్లను వచ్చినట్టు.. నంది పంపుహౌస్​ద్వారా లిఫ్ట్​చేస్తున్నాం. ఒకవేళ మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే, ఇప్పుడు కిందికి వదలాల్సి వచ్చేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగేండ్లలో మేడిగడ్డ నుంచి 180 టీఎంసీలు లిఫ్ట్​చేసింది. అందులో 100 టీఎంసీలు మళ్లీ గోదావరిలోకి వదిలేసిన్రు. దీంతో రూ.2 వేల కోట్ల కరెంట్ బిల్లు వృథా అయ్యింది” అని చెప్పారు. కేటీఆర్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎన్డీఎస్​ఏ తప్పుడు రిపోర్టు ఇచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఎస్​ఏ సూచన మేరకే ప్రభుత్వం కాళేశ్వరం బ్యారేజీల గేట్లను ఓపెన్​చేసిందని వివరించారు. 

బీజేపీ లీడర్లకు దమ్ముంటే ఫండ్స్​ తేవాలి

బీజేపీ లీడర్లు ప్రెస్​మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. వాళ్లకు దమ్ముంటే, రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో కొట్లాడి రాష్ర్టానికి ఫండ్స్​తీసుకురావాలని వివేక్​సవాల్ విసిరారు. ‘‘జిల్లాలో పోడు భూముల సమస్యలు ఉన్నయ్. అభివృద్ధి పనులకు ఫారెస్ట్​పర్మిషన్లు ఇస్తలేరు. కేంద్రంపై ఒత్తిడి పెంచి అటవీశాఖ పర్మిషన్లు తీసుకురావాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్​మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. గత పదేండ్లలో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రా న్ని పాలించిన బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో ఒక్కొక్కరిపై రూ.3 లక్షల అప్పుల భారం మోపాయని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో పంటలు మునిగిపోకుండా కాపాడుతాం. ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత వచ్చే ఏడాది కరకట్టలు కడతాం” అని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్​నాయకులు చేగుర్తి సత్యనారాయణరెడ్డి, బండి సదానందం పాల్గొన్నారు.