కేసీఆర్, జగన్, మోదీకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కేసీఆర్, జగన్, మోదీకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తిరుమల: అహంకారపు నేతలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ తిరుమల ఆయన కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయక మంటపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, టీటీడీ అధికారులు శేష వస్ర్తంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ కు , ఏపీలో జగన్ కు, కేంద్రంలో మోదీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని అన్నారు.  మోదీ సర్కారుకు ఆదరణ తగ్గిందని, కాంగ్రెస్ కు మంచి మెజార్టీ వచ్చిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈడీ, సీబీఐని అడ్డు పెట్టుకొని తిరిగి అధికారంలోకి రావాలని చూసిందని, ప్రజలు ఓటుతో బలమైన సమాధానం చెప్పారని అన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలవడం సంతోషంగా ఉందని చెప్పారు. 

తాతయ్య అడుగు జాడల్లో నడుస్తా: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమల: ప్రజల ఆదరణతో పెద్దపల్లిలో లక్ష ఓట్ల భారీ మెజార్టీ సాధించానని, తాతయ్య గడ్డం వెంకటస్వామి అడుగుజాడల్లో  నడుస్తానని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజల ప్రేమను గెలుచుకోవాలని, అహంకారంతో విర్రవీగవద్దని ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, దేశంలో మంచి సంఖ్యలో సీట్లు రావడం ఆనంద దాయకమని చెప్పారు. 400 సీట్లు వస్తాయని ఆశించిన మోదీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.