గోల్డ్ లోన్ బాధితుల గోడు పట్టని ఎస్బీఐ.. రికవరీ చేసిన బంగారం అప్పగించడంలో తీవ్ర జాప్యం

గోల్డ్  లోన్  బాధితుల  గోడు పట్టని ఎస్బీఐ.. రికవరీ చేసిన బంగారం అప్పగించడంలో తీవ్ర జాప్యం
  • చెన్నూర్​ బ్రాంచ్​లో స్కామ్ బయటపడి 9 నెలలు
  •  పరిహారం కావాలంటే సెటిల్​మెంట్​ చేసుకోవాలని నోటీసులు
  • బ్యాంకు కొర్రీలతో రూ.లక్షల్లో నష్టపోతామంటున్న కస్టమర్లు
  • నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న బాధితులు  

మంచిర్యాల/ చెన్నూర్, వెలుగు: నిరుడు ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూర్​ ఎస్బీఐ గోల్డ్​ లోన్​ బాధితుల పరిస్థితి ఆగమాగం అవుతోంది. బ్యాంకు నుంచి పోయిన తమ బంగారం రికవరీ అయినందుకు ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ఆ గోల్డ్​ తిరిగి ఇవ్వకపోవడంతో బాధపడుతున్నారు. రూ.13 కోట్లకు పైగా విలువైన ఈ స్కామ్​ బయటపడి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా కొలిక్కి రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 

పోలీసులు కేసును చాలెంజింగ్​గా తీసుకొని నెల రోజుల్లోనే 20.50 కిలోల బంగారాన్ని రికవరీ చేసినప్పటికీ, దానిని కస్టమర్లకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో నిత్యం బ్యాంకు చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితులు తమ బంగారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా బ్యాంకు ఎదుట రిలే దీక్షలు, వంటావార్పులు చేస్తున్నా ఎస్బీఐ అధికారులు స్పందించడం లేదు.

సంచలనం రేపిన స్కామ్..

చెన్నూర్​ ఎస్బీఐ–2 బ్రాంచిలో 402 మంది కస్టమర్లు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి గోల్డ్​ లోన్లు తీసుకున్నారు. ఈ గోల్డ్​ను క్యాషియర్​ రవీందర్ చోరీ చేసి ప్రైవేట్  గోల్డ్​ లోన్​ సంస్థల్లో పెట్టి కోట్లలో అప్పులు తీసుకున్నాడు. మరో 42 ఫేక్​ లోన్లపై రూ.1.58 కోట్లు స్వాహా చేయడంతో పాటు రూ.1.10 కోట్లు నగదు దొంగిలించాడు. 2025 ఆగస్టు 21న ఈ స్కామ్ బయటపడగా, ఎస్బీఐ మంచిర్యాల రీజినల్  మేనేజర్  రితేశ్​కుమార్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసును చాలెంజింగ్​గా తీసుకున్న పోలీసులు క్యాషియర్​ రవీందర్​ను ప్రధాన నిందితుడుగా గుర్తించారు. ఇందులో మేనేజర్​ మనోహర్​ రెడ్డి, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి లక్కాకుల సందీప్​ పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు. ఈ కేసులో రవీందర్​కు సహకరించిన 44 మందిపై కేసు నమోదు చేసి నిరుడు ఆగస్టు 31న పలువురిని అరెస్ట్​ చేశారు. రవీందర్​ మంచిర్యాల, చెన్నూర్​లోని వివిధ గోల్డ్​లోన్​ సంస్థల్లో తాకట్టు పెట్టిన 20.50 కిలోల బంగారాన్ని రికవరీ చేసి కోర్టుకు అప్పగించారు. కోర్టు ఆదేశాలతో గోల్డ్​ను ఎస్బీఐకి తరలించారు. 

బ్యాంకు నోటీసులతో ఆందోళన 

పోలీసులు రికవరీ చేసిన బంగారాన్ని తమకు అప్పగించాలని కస్టమర్లు నిత్యం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇటీవల బ్యాంకు అధికారులు జారీ చేసిన నోటీసులు చూసి ఆందోళన చెందుతున్నారు. ఆభరణాలు కావాల్సిన వారు సెటిల్​మెంట్​ చేసుకోవాలని, మీరు తాకట్టు పెట్టిన గోల్డ్​​బరువు, స్వచ్ఛత ఆధారంగా ప్రస్తుత మార్కెట్​ రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఆభరణాలు తీసుకోదల్చిన కస్టమర్లు లోన్​ క్లోజ్​ చేయడమే కాకుండా బ్యాంకుపై ఎటువంటి క్లెయిమ్​ లేకుండా, కోర్టు ఆదేశాల మేరకు గోల్డ్​ అందజేసే దాకా వెయిట్​ చేస్తామంటూ కాన్సెంట్​ ఇవ్వాలని కోరారు. నోటీసులు అందిన 15 రోజుల్లో రెండింటిలో ఏదో ఒక ప్రపోజల్​కు అంగీకరించాలని, లేదంటే గడువు ముగిసిన నెల రోజుల్లో పరిహారం మొత్తాన్ని తామే ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. 

నష్టపోతామంటున్న బాధితులు 

బ్యాంకు అధికారులు సూచించిన రెండు ప్రపోజల్స్​లో దేనికి ఒప్పుకున్నా.. తాము భారీగా నష్టపోతామని కస్టమర్లు పేర్కొంటున్నారు. ఎలాగంటే.. ఒక కస్టమర్​ రెండేండ్ల కింద 10 తులాల బంగారంపై రూ.4 లక్షలు లోన్​ తీసుకున్నాడనుకుంటే, అప్పుడు 24 క్యారెట్​ 10 గ్రాములకు రూ.70 వేల నుంచి రూ.74 వేలు ఉంది.10 తులాలకు రూ.7 లక్షల నుంచి రూ.7.40 లక్షలు అవుతుంది. ప్రస్తుతం రూ.1.60 లక్షలు పలుకుతోంది. 

ఈ లెక్కన 10 తులాలకు రూ.16 లక్షలు అవుతోంది. కానీ, బ్యాంకు అధికారులు 22 క్యారెట్, నెట్​ వెయిట్​కు ఇప్పటి రేటును లెక్కగట్టి పరిహారం చెల్లిస్తామంటున్నారు. పైగా ఆభరణాల తయారీ ఖర్చులు, 20 శాతం జీఎస్టీతో పాటు తరుగు తీసేస్తే దాదాపు రూ.3లక్షల దాకా నష్టపోతామని కస్టమర్లు వాపోతున్నారు.

 మహిళలకు బంగారం ఓ సెంటిమెంట్​ కావడం, ఎంతో ఇష్టంగా చేయించుకున్న నగలు దక్కకపోవడంతో కంటతడి పెట్టుకుంటున్నారు. కోర్టు తీర్పు పేరిట కాలయాపన చేస్తూ తమను వేధించడం మానుకోవాలని, తనఖా పెట్టిన బంగారం వెంటనే తమకు ఇవ్వాలని, గోల్డ్​ లోన్​ వడ్డీతో సహా 50 శాతం మాఫీ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.