31 నుంచి గోవాలో చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌.. 23 ఏండ్ల తర్వాత ఇండియాలో మెగా టోర్నీ

31 నుంచి గోవాలో చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌.. 23 ఏండ్ల తర్వాత  ఇండియాలో మెగా టోర్నీ
  • బరిలో 82 దేశాల నుంచి 206 మంది ప్లేయర్లు
  • లోగో, గీతం ఆవిష్కరించిన గోవా సీఎం సావంత్

పనాజి (గోవా): ప్రతిష్టాత్మక ఫిడే చెస్ వరల్డ్ కప్‌‌‌‌ 23 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాకు తిరిగొచ్చింది. ఈ నెల 31 నుంచి నవంబర్ 27 వరకు నార్త్‌ గోవాలో ఈ  మెగా ఈవెంట్ జరగనుంది. ఈ టోర్నీ అధికారిక లోగో, గీతాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం (అక్టోబర్ 21) ఆవిష్కరించారు.  

మ్యూజిక్ లెజెండ్ దలేర్ మెహందీ ఆలపించిన ఈ పాట గోవా సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ, టోర్నమెంట్ స్ఫూర్తిని రగిలించేలా ఉంది.  నార్త్‌‌‌‌ గోవాలో జరిగే ఈ నాకౌట్ టోర్నీలో 82 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు మొత్తం 17.58 కోట్ల ప్రైజ్ మనీ  కోసం పోటీపడతారు. ఈ వరల్డ్ కప్‌‌‌‌ ద్వారా 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌‌‌కు మూడు బెర్తులు లభిస్తాయి.

 సొంతగడ్డపై జరగబోయే మెగా టోర్నీలో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌తో పాటు తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌‌‌‌, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, నిహాల్ సరిన్ తదితర ఇండియన్స్ పోటీలో ఉన్నారు. దివ్య దేశ్‌‌‌‌ముఖ్ చివరి నిమిషంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓపెన్ సెక్షన్‌‌‌‌లో ఎంట్రీ సాధించింది. అనిష్ గిరి, వెస్లీ సో, విన్సెంట్ కీమర్, హన్స్ నీమాన్, నోదిర్‌‌‌‌బెక్ అబ్దుసతొరోవ్, ఇయాన్ నెపోమ్నియాచి, రిచర్డ్ రాపోర్ట్ వంటి  ఇంటర్నేషనల్ లెజెండ్స్ కూడా బరిలో నిలిచారు. 

 అర్జెంటీనాకు చెందిన 12 ఏండ్ల యంగ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌  ఫౌస్టినో ఒరో కూడా పాల్గొనడం ఈ టోర్నీకి మరో ప్రత్యేకతగా మారనుంది. ‘చెస్ మెస్సీ’గా పేరు తెచ్చుకున్న ఒరో ఈ ఎడిషన్‌‌‌‌లో బరిలోఉన్న యంగెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలవనున్నాడు.  కాగా, ఇండియా చివరగా ఆతిథ్యం ఇచ్చిన 2002  ఎడిషన్‌‌‌‌లో  విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గాడు.