రాజాసింగ్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండ్రు

రాజాసింగ్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండ్రు

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే రిలీజ్ చేయాలని హిందూ జనగృహి సంస్థ కో ఆర్డినేటర్ చేతన్  జనార్దన్ డిమాండ్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్ లోని జలరామ్ భవన్ లో హిందూ సంఘాల నేతలు సమావేశమయ్యారు. రాజాసింగ్ ను రిలీజ్ చేయాలంటూ ప్లకార్డులు  ప్రదర్శించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు జనార్దన్, కశ్యప్ మహర్షి మాట్లాడుతూ... హిందువుల కోసం పోరాడుతున్న రాజా సింగ్ కు మద్దతు తెలపాలని అన్ని సంఘాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజాసింగ్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ చట్టం కింద కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు.

హిందూ దేవుళ్ళను అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న మునావర్ ఫారూఖీ ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. రాజా సింగ్ కు మద్దతుగా వినాయక చవితి మండపాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తామని, నిమజ్జనం రోజున వాహనాలకు బ్యానర్లు కట్టి నిరసన తెలుపుతామన్నారు. ఇదే విషయమై కలెక్టర్ల కి వినతి పత్రాలు అందజేస్తామని, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించారు.