- రైతుల ఫిర్యాదుతో అధికారుల విచారణ
- కంపెనీ ఏజెంట్ మోసం చేశాడని ఆరోపణ
చేవెళ్ల, వెలుగు: మైకో’ కంపెనీ బీట్రూట్ విత్తనాలు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ రైతులను నిండా ముంచాయి. విత్తనాలు వేసి వారాలు గడుస్తున్నా మెలకెత్తకపోవడంతో వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు. బాధిత రైతుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శేరి దశరథ్ రెడ్డి, శేరి యాదిరెడ్డి, మల్గారి శ్రీకాంత్ రెడ్డి, మొరంగి మల్లారెడ్డి, శేరి మల్లారెడ్డి, శేరి కృష్ణారెడ్డి వద్దకు 20 నుంచి 25 రోజుల కింద మైకో కంపెనీ ఏజెంట్ నెల్సన్ బాబు వెళ్లాడు. తమ కంపెనీ బీట్రూట్ విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుందని నమ్మబలికాడు. నమ్మిన రైతులు అతని వద్ద నుంచి 117 ప్యాకెట్లు(ఒక్కోటి 200 గ్రాములు) రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి11 ఎకరాలకుపైగా పంట సాగు చేశారు. ఈ ప్యాకెట్లు కూడా 90 వరకు నగరంలోని హైదర్ గూడ నుంచి తీసుకువచ్చాడు.
అవి సరిపోకపోవడంతో మిగతావి చేవెళ్లలోని మూడు ఫర్టిలైజర్ షాపుల నుంచి తీసుకువచ్చి రైతుల ఇండ్ల వద్ద అమ్మాడు. విత్తనాలు వేసి 20 రోజులు గడుస్తున్నా సరిగ్గా మొలకెత్తకపోవడంతో బాధిత రైతులు సోమవారం అగ్రికల్చర్ ఆఫీసర్ శంకర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆయన చేవెళ్ల డివిజన్ హార్టిక్చలర్ ఆఫీసర్ కీర్తి కృష్ణతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసి వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్లలో విత్తనాలు అమ్మిన మూడు ఫర్టిలైజర్ షాపులను కూడా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ రిపోర్టును పైఅధికారులను సమర్పిస్తామని వెల్లడించారు.
ఏజెంట్ మోసం చేసిండు
ఆరుగురు రైతులం 11 ఎకరాల్లో బీట్రూట్ సాగు చేసినం. 117 ప్యాకెట్లను మైకో కంపెనీ ఏజెంట్ నెల్సన్ బాబు తమ ఇళ్ల వద్దకు తీసుకొచ్చి రూ.1000 చొప్పున అమ్మిండు. కానీ, ఆ విత్తనాలు మెలకెత్తలే. విత్తనాలు, డ్రిప్, కలుపులు, అడుగు మందులు కలిపి రూ.4 లక్షల వరకు నష్టపోయినం.– శేరి దశరథ్ రెడ్డి, కందవాడ
