పంచాయతీ ఆఫీసు గదిలో 60 ఆవుల బందీ: ఊపిరాడక 43 గోవుల మృతి

పంచాయతీ ఆఫీసు గదిలో 60 ఆవుల బందీ: ఊపిరాడక 43 గోవుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు గోవుల పట్ల ఘోరంగా ప్రవర్తించారు. ఆవులను ఒక చిన్న గదిలో కిక్కిరిసిపోయేలా కుక్కి బంధించి.. వాటి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో ఈ దారుణం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మెడ్పార్ అనే గ్రామంలోని పాత పంచాయతీ బిల్డింగ్ వద్ద నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో గ్రామస్థులు తలుపులు బద్దలు కొట్టి చూశారు. పాత పంచాయతీ భవనంలోని ఒక చిన్న రూమ్‌లో భారీ సంఖ్యలో ఆవులు మరణించి పడి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెటర్నరీ డాక్టర్లతో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. మొత్తం 43 ఆవులు మరణించాయని, వాటికి పోస్టుమార్టం చేయగా.. ఊపిరాడక మరణించినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

ఎన్నాళ్ల క్రితం బంధించారో..

ఈ ఘటనపై బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్ సారాన్ష్ మిట్టర్ స్పందించారు. పశువుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిందెవరో తెలియాల్సి ఉందని అన్నారు. దీనిపై ఎంక్వైరీకి ఆదేశించామని చెప్పారు. ఎన్నాళ్ల క్రితం, ఎవరు ఆ గోవులను ఆ గదిలో బంధించి, లాక్ చేశారో తేల్చాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై జంతు హింస నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ చెప్పారు. 60 ఆవులను ఇరుకు గదిలో బంధించడంతో ఊపిరాడక 43 గోవులు మరణించాయని, మిగిలిన 17 ఆవుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.