మోడీ మన్ననలు అందుకున్న ఛోలే వాలా

 మోడీ మన్ననలు అందుకున్న ఛోలే వాలా

భారతదేశంలో కరోనాకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సర్కారు సూచిస్తున్నా.. చాలా మంది వేసుకోవడం లేదు. ఈనేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు స్వచ్చంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. టీకా డోస్ తీసుకుంటే బహుమతులను ఆఫర్ చేస్తున్నాయి. ఈక్రమంలో ఛండీగడ్ కు చెందిన చిరువ్యాపారి  సంజయ్ రాణా  నేనుసైతం అంటూ ఓ అడుగు ముందుకు వేశారు. టీకా బూస్టర్ డోసు తీసుకునే వారికి ఫ్రీగా చోలే భతురే అందిస్తున్నారు. తన కుమార్తె, మేనకోడలు సూచన మేరకు వ్యాక్సిన్ వేయించుకునే వారికి ఉచితంగా చోలే భతురే ఇస్తున్నానని సంజయ్ చెబుతున్నారు.  

ఇక సంజయ్ రాణా విషయానికి వస్తే.. సైకిల్ పై తిరుగుతూ ఛోలే భతురే విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా తాను కొవిడ్ టీకా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలైన కొత్తలోనూ.. టీకా తీసుకున్న వారికి ఈవిధంగా ఫ్రీగా చోలే భతురేను సంజయ్ రాణా పంపిణీ చేశారు. ఇటీవల  ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సంజయ్ రాణాను మోడీ ప్రశంసించారు. ‘‘ అదే రోజు వ్యాక్సిన్ తీసుకున్నట్లు రుజువు చూపించగానే సంజయ్ రాణా ఎంతో రుచికరమైన ఛోలే భతురే అందిస్తారు’’ అని మోడీ చెప్పారు. సంజయ్ రాణా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.