
రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని, అలా ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడుదామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసి రావాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు శనివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
స్వార్థ రాజకీయాల కోసం, విచ్ఛిన్నకర శక్తులు రాష్ట్రంలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజాపక్షం వహించే రాజకీయవేత్తలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ కోరారు. మత విద్వేశ శక్తులను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణ మద్దతు అందిస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై సీపీఎం నేతలు కేసీఆర్ కు వినతిపత్రాన్ని అందించారు.