
హన్మకొండలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి బస చేయనున్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మునిగిపోయిన పంట పొలాలు, వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు వెళ్లారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటూరునాగారంతో పాటు వరద ముంపు ప్రాంతాల్లోని పరిస్థితులపై పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇతర కార్యక్రమాలపై ఆరా తీశారు. ఆదివారం (జులై17న) ఉదయం గోదావరి ముంపు ప్రాంతాల్లోని భద్రాచలం, ములుగు జిల్లాలో ఏరియల్ వ్యూ చేయనున్నారు. ఏటూరునాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వారాజు సారయ్య, టీఆర్ఎస్ ఇతర ప్రజా ప్రతినిధులందరూ ఉన్నారు.