
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ‘మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తుందని చెప్పారు.
‘మే’ డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు– 2025ని త్వరలో తీసుకవస్తామని వివరించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం రేవంత్ వెల్లడించారు.