వ్యవసాయశాఖలోనూ ఫేషియల్‌ అటెండెన్స్‌.. ఇకపై ఆన్‌లైన్‌లోనే హాజరు సమాచారం

వ్యవసాయశాఖలోనూ ఫేషియల్‌ అటెండెన్స్‌..  ఇకపై ఆన్‌లైన్‌లోనే హాజరు సమాచారం
  • మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ, దాని అనుబంధ డిపార్ట్‌మెంట్లు, కార్పొరేషన్ ఆఫీసుల్లో ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆఫీసులకు సమయానికి రాకపోవడం, వచ్చినా త్వరగా వెళ్లిపోవడం వంటి నిర్లక్ష్యాలకు చెక్​పెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినప్పటికీ, ఉద్యోగుల తీరులో మార్పు రాకపోవడంతో శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. 

అటెండెన్స్ నియంత్రణ కోసం బయోమెట్రిక్ వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరించి ఆన్‌లైన్ డాష్‌బోర్డు ద్వారా రోజువారీ మానిటరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇష్టానుసారంగా విధులకు ఎగనామం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ చర్యలతో వ్యవసాయ శాఖ సేవలు రైతులకు మరింత సమర్థవంతంగా, సకాలంలో అందుతాయని అధికారులు భావిస్తున్నారు.

నిర్లక్ష్యం వమిస్తే క్రమశిక్షణ చర్యలు 

ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడీ) కార్యాలయాల్లో ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరవుతున్నట్లు గుర్తించారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి శాఖ కార్యదర్శి  సురేందర్ మోహన్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల హెచ్‌ఓడీలకు కార్యదర్శి సురేందర్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టులను (ఏటీఆర్) తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అటెండెన్స్ నిఘాను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఐటీ శాఖతో సమన్వయం చేసి ఆన్‌లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశించారు. ఈ డాష్‌బోర్డు ద్వారా వ్యవసాయ శాఖ, అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు సమాచారం రోజువారీగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనుంది.  త్వరలో  వ్యవసాయ శాఖ, అనుబంధ కార్పొరేషన్లలో పూర్తిస్థాయి ప్రక్షాళన చర్యలు చేపడుతున్నట్లు కార్యదర్శి సురేందర్ మోహన్ వెల్లడించారు.

కొందరి నిర్లక్ష్యంతో శాఖకే బద్నామ్​​ : తుమ్మల

ప్రజా పాలనలో రైతాంగ సంక్షేమం కోసం  ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్యోగులకు  మంత్రి తుమ్మల  సూచించారు. కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల మొత్తం శాఖకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి రాకూడదన్నారు.