- ఈ ఏడాది అక్టోబర్ నాటికి 72 వేల కొత్త కేసులు
- నిరుడు జనవరి నుంచి డిసెంబర్ నాటికి 76 వేల కేసులు
- దేశ సగటు తగ్గుతుంటే రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న హెల్త్ ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్షయ (టీబీ) మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. చాపకింద నీరులా నిశబ్దంగా తన పరిధిని విస్తరిస్తున్నది. ఎంతలా అంటే... రాష్ట్రంలో రోజూ సగటున 243 మంది టీబీ బారిన పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఏకంగా 72,840 మంది ఈ మహమ్మారి బారినపడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా టీబీ కేసులు తగ్గుముఖం పడుతుంటే... మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘టీబీ ముక్త్ భారత్’ రిపోర్టు ప్రకారం... నిరుడు మన రాష్ట్రంలో 76, 611 టీబీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికే అంటే పది నెలల కాలంలోనే టీబీ బాధితుల సంఖ్య 72,840గా నమోదైంది. ఇంకా నవంబర్, డిసెంబర్ లెక్కలు కలపకముందే ఈ స్థాయిలో కేసులు నమోదవుతుంటే లాస్ట్ ఇయర్ నమోదయిన కేసులను దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. మన రాష్ట్రంలో కేసులు పెరుగుతుంటే... దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యం ఏటా తగ్గుతూ వస్తున్నది. 2024లో దేశవ్యాప్తంగా మొతతం 26.18 లక్షల టీబీ కేసులు నమోదయితే, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నాటికి 22. 64 లక్షల కేసులు రికార్డయ్యాయి.
దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 4 లక్షల కేసులు తగ్గాయి. అయితే... ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 6 లక్షలు, మహారాష్ట్రలో 1.88 లక్షలు, బిహార్ లో 1.80 లక్షలు, రాజస్థాన్ లో 1.51 లక్షలు కేసులు నమోదయ్యాయి. 2025 నాటికి దేశాన్ని టీబీరహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, కేంద్రం లక్ష్యం ఇప్పట్లో నేరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఉత్తర భారతంలో లక్షల్లో నమోదవుతున్న కేసులు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెరుతుగున్న కేసులు చూస్తుంటే... కేంద్రం టీబీ నిర్మూలనకు మరో ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది.
జాగ్గత్తగా లేకుంటే ప్రాణాంతకమే...
మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియాతో వచ్చే అంటువ్యాధి టీబీ. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది. టీబీ ఉన్న వ్యక్తి మాస్కు లేకుండా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినప్పుడు వారి నుంచి వెలువడిన సూక్ష్మక్రిములు కలిసిన గాలిని పీల్చినవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, పోషకాహార లోపం ఉన్నవారు, డయాబెటిస్, ఎయిడ్స్ బాధితులు, బీడీ, సిగరెట్, మందు అధికంగా తీసుకునే వారిని ఈ బ్యాక్టీరియా తొందరగా ఎటాక్ చేస్తుంది. టీబీ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘‘పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు... వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కు ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి రుమాలు అడ్డుపెట్టుకొవాలి. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కఫం పరీక్ష చేయించుకోవాలి. టీబీ అని తేలితే.. డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. లక్షణాలు తగ్గాయని మధ్యలోనే మందులు ఆపేస్తే... అది మందులకు లొంగని మొండి టీబీగా మారి ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది” అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
యాక్టివ్ కేసుల కోసంజల్లెడ పట్టడం వల్లే...
యాక్టివ్ కేసుల కోసం క్షేత్రస్థాయిలో జల్లెడపట్టడం వల్లే కేసుల సంఖ్యపెగరుతున్నదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. టీబీని నోటిఫయబుల్ డిసీజ్ లో చేర్చడంతో.. కేసుల వివరాలు పక్కాగా తెలుస్తున్నాయంటున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే టీబీ వ్యాప్తి రేటు 21 శాతం తగ్గిందని, 2015లో ప్రతి లక్ష మంది జనాభాకు 237 మందికి టీబీ సోకగా... 2024 నాటికి అది 187కి తగ్గిందంటున్నారు. 2015లో 53 శాతం మందికి మాత్రమే చికిత్స అందేదని, ఇప్పుడది 92 శాతానికి పెరిగిందని అంటున్నారు.
‘‘హై-రిస్క్ ఏరియాల్లో స్పెషల్ క్యాంపులు పెట్టి లక్షణాలు లేనివారికి కూడా టెస్టులు చేసి కేసులను గుర్తిస్తున్నాం. గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకునే వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కేవి కావు. ఇప్పుడు ని-క్షయ్ పోర్టల్ ద్వారా ప్రైవేట్ డాక్టర్లు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో మాలిక్యులర్ టెస్టులు, ఎక్స్- రే స్క్రీనింగ్ ద్వారా వ్యాధిని త్వరగా గుర్తిస్తున్నారు. దీంతో రికార్డుల్లోకి ఎక్కుతున్న బాధితుల సంఖ్య పెరిగింది ” అని నిపుణులు పేర్కొన్నారు.
