
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డిని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పలు రెవెన్యూ సంఘాల నాయకులు కలిశారు. సోమవారం సెక్రటేరియేట్‌లో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
5 నెలల వేతన బకాయిలు, గుర్తింపు సంఖ్య కేటాయింపుతో సహా అనేక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు లచ్చిరెడ్డి మీడియాకు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్‌సింగ్ చౌహాన్, వీఆర్ఏ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.