
చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాస్టర్ భరత్‌కు మాతృ వియోగం కలిగింది. ఆదివారం (మే18న) రాత్రి మాస్టర్ భరత్ తల్లి కమల హాసిని కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా భరత్ తల్లి కమల హాసిని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెన్నైలో సడెన్ గా ఆమెకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల సమాచారం. దీనిపై భరత్ అధికారికంగా ప్రకటించలేదు.
భరత్ తన తల్లిని కోల్పోయిన దు:ఖంలో ఉండడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. తన తల్లి పార్థివ దేహం దగ్గర భరత్ కూర్చుని ఏడుస్తున్న ఫోటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు సైతం ధైర్యం చెబుతూ ఓదార్పును అందిస్తున్నారు.
నటుడు భరత్.. దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అందులో రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శీను వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
రెడీ మరియు బిందాస్ చిత్రాలలో తన పాత్రలకు ఉత్తమ బాల నటుడిగా రెండు నంది అవార్డులను గెలుచుకున్నాడు. ప్రస్తుతం పెద్దయ్యాక పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్నాడు.