
రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేయనున్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు లభించింది. పిల్లల బాగోగులు, ఆరోగ్యంగా ఎదుగుదల, టీకాలు, రోగ నిరోధక శక్తి పెంపుదల, పౌష్టికాహారం అందించడం వంటి 8 అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31న రాష్ట్రం నుంచి 3 పంచాయతీల పేర్లను అధికారులు పంపించారు. వీటిలో పైడిమడుగు గ్రామాన్ని చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది.
2016-–17, 2017-–18 సంవత్సరాల పనితీరును పరిగణనలోకి తీసుకొని ప్రతి రాష్ట్రం నుంచి ఒక గ్రామాన్ని ఈ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిని ఎంపికైన గ్రామ పంచాయతీకి అందచేయనుంది. ఏప్రిల్ 24ననే ఈ అవార్డును అందచేయాల్సి ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా పడింది. ఈ అవార్డును కేంద్రం త్వరలో ప్రదానం చేయనుంది.