ఐస్​క్రీమ్​ కోసం ఫ్రిడ్జ్​ డోర్​ తీస్తుండగా..కరెంట్​ షాక్​ కొట్టి చిన్నారి మృతి

ఐస్​క్రీమ్​ కోసం ఫ్రిడ్జ్​ డోర్​ తీస్తుండగా..కరెంట్​ షాక్​ కొట్టి చిన్నారి మృతి

నందిపేట, వెలుగు:  తండ్రితో కలిసి షాపింగ్ మాల్​కు వెళ్లిన చిన్నారి.. ఐస్​క్రీమ్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తెరిచే క్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూరు రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. 

సోమవారం పొద్దున నవీపేటకు వెళ్తూ సరుకుల కోసం నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్​కు కూతురు రిశిత (4)తో కలిసి వెళ్లాడు. రాజశేఖర్ సరుకులు తీసుకుంటుండగా పక్కనే ఫ్రిడ్జ్​లో ఉన్న ఐస్​క్రీమ్ కోసం పాప డోర్ తెరిచే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్​కు గురైంది. పక్కనే ఉన్న తండ్రి ఇది గమనించకపోవడంతో పాప కొన్ని సెకన్ల పాటు ఫ్రిడ్జ్​కు అలాగే వేలాడింది. తర్వాత వెంటనే గమనించిన రాజశేఖర్.. పాపను మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్​కు, తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. 

షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం

ఫ్రిడ్జ్​కు కరెంట్ సప్లై అవుతున్నా షాపింగ్​మాల్ సిబ్బంది పట్టించుకోలేదని తెలిసింది. ఆదివారం కూడా ఫ్రిడ్జ్​కు కరెంట్ సప్లయ్​కావడంతో ఎర్త్ వచ్చిందని మాల్ సిబ్బంది చెప్పారు. మరమ్మతులు చేపట్టకనే చిన్నారి మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్​మార్టం తర్వాత పాప డెడ్​బాడీని కుటుంబ సభ్యులు మాల్ ముందు ఉంచి 4 గంటల పాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలిపారు. ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్ కుమార్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.