27 ఏళ్ల తర్వాత పుట్టి రికార్డు సృష్టించింది

27 ఏళ్ల తర్వాత పుట్టి రికార్డు సృష్టించింది

వాషింగ్టన్‌: 27 ఏళ్ల తర్వాత పుట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు విన్నది నిజమే. మోలీ గిబ్సన్‌ అనే చిన్నారి 27 ఏళ్ల తర్వాత భూమ్మీద పడింది. టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డు సృష్టించారు. ఈ అరుదైన పద్దతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే తాను కూడా గడ్డకట్టించిన పిండం నుంచే జన్మించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో చిన్నారి మోలీ కళ్లు తెరిచింది. కానీ తన గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఇన్నేళ్ల పాటు ఆ పిండాన్ని గడ్డకట్టిన స్థితిలో భద్రపరిచారు. 2020 ఫిబ్రవరిలో ఓ జంట బిడ్డ కావాలని కోరడంతో ఆ పిండాన్ని అభివృద్ధి పరిచారు.

ఎంబ్రోయో డొనేషన్

ఈ పద్దతిని ఎంబ్రోయో డొనేషన్ అంటారు. అంటే పిండాన్ని దత్తత తీసుకోవడం. ఈ పద్దతిలో ఏళ్ల క్రితమే పిండాలను తయారు చేసి వాటిని గట్టకట్టిన స్థితిలో భద్రపరుస్తారు. పిల్లలకు కావాలనుకున్న దంపతులకు ఈ పిండాలను దత్తత ఇస్తారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన ఫ్రోజెన్ స్థితిలోనే ఉంది. ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లలు కోసం కలలుగనే జంటల కోసం ఇప్పుడు ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ‘ఎంబ్రోయో డొనేషన్’‌ విధానం చాలా చాలా ప్రత్యేకం. అంతేగాక.. ఇదెంతో అరుదైనది కూడా. ఇక పిండం దత్తత మనకు వింతగా ఉన్నా అమెరికాలో మాత్రం ఇది ఎప్పటి నుంచో ఉంది.

ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ ఎన్‌ఈడీసీ అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది. సాధారణంగా మనందరం దాదాపు తొమ్మిదినెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత భూమ్మీ​దకు వస్తాం. కానీ.. ఈ పద్దతి ద్వారా 27 ఏళ్ల తర్వాత శిశువు జన్మించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లను అభినందిస్తున్నారు.