
కిడ్నాప్ ముఠాలో కీరోల్గా
సిద్దిపేట నర్సింగ్ హోం డాక్టర్
రూ. 40 వేల నుంచి రూ.7 లక్షల దాకా అమ్మకం
రూ. 4.50 లక్షలకు బిడ్డలను అమ్మేసిన తండ్రి
తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లల అప్పగింత
గచ్చిబౌలి, వెలుగు: సొంత ఊరిలో ఉపాధి దొరక్క బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి రైల్వే స్టేషన్లు, గుడిసెల్లో ఉంటూ కూలీ పనులు చేసుకునే వారి పిల్లలను టార్గెట్చేసుకున్న ఓ ముఠా.. వారిని కిడ్నాప్ చేసి సంతానం లేని దంపతులకు అమ్మేస్తోంది. చందానగర్పోలీస్స్టేషన్పరిధిలో కిడ్నాప్‌కు గురైన ఓ బాలుడిని పోలీసులు రక్షించి నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా ఐదేండ్లలోపు వయస్సున్న ఆరుగురు పిల్లలను కిడ్నాప్‌చేసి అమ్మేసినట్లు తెలిసింది. సిద్దిపేటలో నర్సింగ్‌హోం నిర్వహిస్తున్న ఓ డాక్టర్ఈ ముఠా కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. పిల్లలందరిని రక్షించి ఇద్దరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన పిల్లలను డీసీపీవో కస్టడీలో ఉంచారు.
ఈ ముఠాను విచారించిన పోలీసులకు పిల్లలను అమ్ముకున్న తండ్రి బాగోతం బయటపడింది. తన ఇద్దరు పిల్లలను ఈ ముఠాకు అమ్మేసినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ. 5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్జోన్డీసీపీ అఫీస్‌లో డీసీపీ డా.జి. వినీత్ వివరాలను వెల్లడించారు.
పేరుకు నర్సింగ్ క్లినిక్.. చేసేది కిడ్నాప్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉండే చిలుకూరి రాజు పటాన్‌చెరులోనే ఆయుర్వేదిక్ మందుల స్టాల్ నిర్వహిస్తుంటాడు. అతని వద్దకు పటాన్ చెరుకి చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ ఆసీఫ్ ఆయుర్వేదిక్ మందుల కొనుగోలు చేసేందుకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆసిఫ్ అత్త సిద్దిపేటలో ఉన్న ఓ నర్సింగ్ క్లీనిక్‌లో ఆయాగా పనిచేస్తుంది. తరచూ తన అత్తను చూసేందుకు వెళ్లే అసీఫ్కు అక్కడ డాక్టర్ రిజ్వానా పరిచయమైంది. ఢిల్లీలో బీఎఎంఎస్ ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకుంటున్న రిజ్వానా సిద్ధిపేటలో నర్సింగ్ క్లీనిక్ నిర్వహిస్తోంది.
సులభంగా డబ్బు సంపాదించడం కోసం చిన్నారుల కిడ్నాప్ చేసి పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయించేందుకు ప్లాన్ వేసింది. తన వద్దకు వచ్చే పిల్లలు లేని తల్లిదండ్రులకు చిన్నారులను విక్రయించేందుకు బేరం మాట్లాడుకునేది. తర్వాత ఈ విషయాన్ని ఆసిఫ్ కు చెప్పగా, ఆసిఫ్ కిడ్నాప్ పనిని రాజుకు అప్పగించేవాడు. రాజు స్థానికంగా రైల్వే స్టేషన్లు, వలస కూలీ కాలనీల్లో రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉన్న ఐదేండ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేసి ఆసిఫ్ కు అప్పగించేవాడు. ఆసిఫ్ సదరు పిల్లలను రిజ్వానా చెప్పిన వారికి అమ్మేవాడు. ఈ విధంగా వచ్చిన డబ్బును ముగ్గురు పంచుకునే వారు.
బయటపడింది ఇలా...
పటాన్‌చెరుకు చెందిన పోచమ్మ దుర్గ ప్రసాద్ దంపతులకు నలుగురు కొడుకులు. బతుకుదెరువు కోసం లింగంపల్లికి వచ్చి లింగంపల్లి ఫ్లైఓవర్కింద గుడిసె వేసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల 26న పోచమ్మ తన భర్తతో కలిసి చిన్న కొడుక్కి ఆరోగ్యం బాగలేకపోతే స్థానికంగా ఉన్న దవాఖానకు తీసుకువెళ్లింది. ఇంట్లో ముగ్గురు కొడుకులు ఆడుకుంటున్నారు. గుడిసె బయట ఆడుకుంటున్న అఖిల్(5)ను రాజు, అతని స్నేహితుడు మూసాపేటలో ఉంటూ మేస్త్రీగా పనిచేసే నర్సింహారెడ్డితో కలిసి కిడ్నాప్ చేసి ఆసిఫ్ కు అప్పగించాడు. అఖిల్ ను రిజ్వానా సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మికి రూ.7 లక్షలకు ఆసీఫ్ అమ్మాడు. కాగా అఖిల్ కనిపించకుండా పోవడంతో చందానగర్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో కిడ్నాప్ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. పోలీసుల విచారణలో కిడ్నాపర్లు వెల్లడించిన సమాచారంతో ఈ ముఠా ఐదేండ్లుగా కిడ్నాప్ చేసిన ఆరుగురు చిన్నారులను కాపాడారు. ఓ తండ్రి నెలల వయస్సున్న ఇద్దరు పిల్లలను ఈ ముఠాకు అమ్మగా, సదరు చిన్నారులను పిల్లలు లేని తల్లిదండ్రులకు ఈ ముఠా అమ్మింది. మొత్తం ఆరుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు డీసీపీవో ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.
తల్లిదండ్రులను గుర్తించని పిల్లలు
ఏండ్ల క్రితం పిల్లలు కిడ్నాప్‌కు గురికావడం, మరీ నెలల వయస్సులో కూడా కిడ్నాప్చేయడంతో ఇప్పుడా పిల్లలు వారి తల్లిదండ్రులను గుర్తించడం లేదు. దీంతో నలుగురు పిల్లలను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులు రాజు, ఆసిఫ్, రిజ్వానా, నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈముఠాకు కన్నబిడ్డలను విక్రయించిన బాలరాజు అనే వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. చిన్నారులను ఆక్రమంగా దత్తత తీసుకున్న తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. మియాపూర్ఏసీపీ, చందానగర్ఇన్స్పెక్టర్, డీఐ, సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మేసిన పిల్లల వివరాలు..
నాలుగేండ్ల కింద కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి లాస్య అనే నెలల వయస్సున్న బాలికను ఈ ముఠా కిడ్నాప్ చేసిన ప్రధాన నిందితుడు రాజు తన బంధువు సంగారెడ్డి హత్నూర్ కు చెందిన మాధవికి రూ.42 వేలకు అమ్మాడు. ఈమెకు 16 ఏండ్ల కింద పెండ్లి కాగా పిల్లలు లేరు.
ఏడాది కింద లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపం నుంచి అరుణ్(2)ను కిడ్నాప్ చేసి సంగారెడ్డి గొల్లపల్లికి చెందిన సుజాతకు రూ.2.10లక్షలకు విక్రయించారు.
3 నెలల కింద అమ్ములు అనే 5 నెలల వయస్సున్న వలస కూలీల బిడ్డను లింగంపల్లిలో కిడ్నాప్ చేసిన ముఠా.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మికి రూ.3.50 లక్షలకు విక్రయించారు. ఈ కిడ్నాప్ పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోగా కేసు సైతం నమోదు కాలేదు. పోలీసులు తల్లిదండ్రులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఆగస్టు 25న లింగంపల్లి ఫ్లైఓవర్ కింద నుంచి అఖిల్(5)ను కిడ్నాప్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లికి చెందిన సిరవేణి లక్ష్మికి రూ.7లక్షలకు విక్రయించారు.
పటాన్ చెరుకు చెందిన నల్ల బాలరాజు అనే తండ్రి 2023లో తన మూడు రోజుల వయస్సున్న కొడుకు ఆద్విక్ ను ముఠాకు అమ్మగా, వీరు చిన్నారిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గొల్లపల్లికి చెందిన మెట్ట దుర్గకు రూ. 2.50 లక్షలకు విక్రయించారు.
2024లో మరోసారి నల్ల బాలరాజు ఒక్క రోజు వయస్సున్న పసికందు ప్రియను ఈ ముఠాకు అమ్మేయగా, వీరు ఉస్మాన్ నగర్ కు చెందిన మహేశ్వరికి రూ.2లక్షలకు విక్రయించారు.