డీజే కావాలి అంకుల్.. ఎస్సైతో ఏడేళ్ల చిన్నారి మారం

డీజే కావాలి అంకుల్.. ఎస్సైతో ఏడేళ్ల చిన్నారి మారం

సంగారెడ్డి, వెలుగు: డీజే కావాలి అంకుల్.. సంతోషంగా పండుగలు చేసుకుంటే ఎందుకు అంకుల్ ఆపేస్తారు. నాకు డీజే కావాలి అంటూ ఓ ఏడేళ్ల చిన్నారి ఎస్సైతో పట్టుబట్టి లొల్లి చేస్తుంటే అక్కడున్నవారు ముక్కు మీద వేలేసుకుని చూస్తుండిపోయారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట టౌన్​లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిమజ్జనోత్సవంలో నిర్వాహకులు, పట్టణ ప్రజలు డీజే సౌండ్ పెట్టి ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. డీజేకు అనుమతి లేదని నిలిపేశారు. దీంతో సదాశివపేట పాతకేరికి చెందిన సంజీవ్(7) ఎస్సైతో డీజే పెట్టించాలని మారాం చేశాడు. అందరి మధ్యలో నిలబడి ఎస్సైతో ఇప్పుడైతే డీజే పెట్టించండి. ఏమైనా ఉంటే నిమజ్జనం తర్వాత చూసుకోండి.. సంతోషంగా పండుగ చేసుకుంటే ఎందుకు అంకుల్ ఆపేస్తారని ధైర్యంగా మాట్లాడాడు. పక్కనున్నవారు ఇదంతా చూసి నవ్వుకున్నారు. బాలుడి తీరు పోలీసులకు సైతం నవ్వు తెప్పించింది. ఇదంతా ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.