అఆలు మతికిలేవు.. ఎక్కాలు యాదిలేవు

అఆలు మతికిలేవు.. ఎక్కాలు యాదిలేవు
  • ఏడాదిన్నరగా ఫిజికల్ క్లాసుల్లేక చదువులు ఆగం
  • చిన్న చిన్న బేసిక్స్​నూ మర్చిపోయిన పిల్లలు
  • ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు ‘అఆ..’ కూడా వస్తలే
  • హైస్కూల్​ స్టూడెంట్లూ తెలుగు చదివేందుకు తడబడుతున్నరు 
  • పిల్లల్ని గాడిలో పెట్టేందుకు పాత పాఠాలు చెప్తున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నరగా ఫిజికల్ క్లాసులకు దూరమైన పిల్లల చదువులు ఆగమయ్యాయి. సగం మందికి పైగా స్టూడెంట్లు చదవడం, రాయడం మర్చిపోయారు. ప్రైమరీ స్కూళ్లలోని చాలా మంది చిన్నారులకు ‘అఆ..’లు కూడా మతికిలేవు. హైస్కూల్ స్థాయిలోనూ తెలుగు పాఠాలు చదవలేకపోతున్న స్టూడెంట్లు గతంలో పోలిస్తే రెండింతలయ్యారు. దీంతో వాళ్లను మళ్లీ గాడిలో పెట్టేందుకు టీచర్లు పాత పాఠాలు చెప్తున్నారు. కరోనా భయం వదిలి రెగ్యులర్​గా స్కూలుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నరు. పిల్లలు రెండు నెలలు స్కూళ్లకొస్తే సెట్ అయిపోతారని చెప్తున్నారు.  

పాత సిలబస్ మొదలు పెట్టిన్రు
రాష్ట్రంలో 40 వేల స్కూళ్లుండగా వాటిల్లో 60 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో గతేడాది మార్చి నుంచి పిల్లలు ఫిజికల్ క్లాసులకు దూరమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 22 రోజులు ఫిజికల్ క్లాసులు జరగ్గా కొద్దిమందే స్కూళ్లకు పోయారు. కానీ మళ్లీ కేసులు పెరగడంతో బడులు మూతబడ్డాయి. గతేడాది ప్రైమరీ స్కూల్స్ స్టూడెంట్లు బడిమొహం కూడా చూడలేదు. టీవీ, ఆన్​లైన్ పాఠాలూ వినలేదు. ఈ విద్యాసంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో ఆన్​లైన్ క్లాసులు జరగ్గా కేసులు తగ్గడంతో ఈ నెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు మొదలు పెట్టారు. అయితే ఏడాదిన్నర తర్వాత స్కూలుకొచ్చిన స్టూడెంట్లు చదవడం, రాయడం మర్చిపోవడంతో టీచర్లు అవాక్కవుతున్నారు. కాస్త మెరిట్ స్టూడెంట్లు కూడా బేసిక్స్ మరిచిపోయినట్టు గుర్తించారు. దీంతో వాళ్లకు మళ్లీ అంతా గుర్తు తెచ్చేందుకు పాత సిలబస్ చెప్తున్నారు. 

10 తరగతి వాళ్లూ తడబడ్తున్నరు
స్టూడెంట్లు ఇంటిదగ్గరున్నప్పుడు ఆన్​లైన్, టీవీ క్లాసులు నడిచినా అవి వాళ్లకు పెద్దగా ఉపయోగపడలేదని తెలుస్తోంది. చాలా మంది స్టూడెంట్లకు తెలుగు కూడా సరిగా చదవడం రావట్లేదని టీచర్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని ఓ హైస్కూల్​లో టెన్త్ క్లాసులో తెలుగులో ఓ పాఠం చదవాలని టీచర్ కోరితే సగం మంది కూడా సరిగా చదవలేదని ఆ టీచర్ చెప్పారు. మ్యాథ్స్ లోని చిన్న చిన్న లెక్కలిచ్చినా చాలా మంది చేయలేకపోయారని హైదరాబాద్​లోని స్కూల్ టీచర్ రవీందర్ తెలిపారు. నగరంలోని మూడో తరగతిలోని స్టూడెంట్లను అఆలు  రాయమంటే 70 శాతం మంది సరిగా రాయలేకపోయారని మరో టీచర్ ప్రశాంత్ చెప్పారు. నల్గొండలోని ఓ స్కూల్​లో ఐదో తరగతి స్టూడెంట్లలో కొంతమంది సెకండ్ టేబుల్ (రెండో ఎక్కం) చెప్పలేకపోయారని ఆ మేనేజ్​మెంట్ ప్రతినిధి చెప్పారు. రెండేండ్ల కింద మంత్రి హరీశ్​రావు సంగారెడ్డి జిల్లాలోని ఓ హైస్కూల్​కు ఆకస్మికంగా తనిఖీకి వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు. టెన్త్ స్టూడెంట్లకు తెలుగులో రాయడం, చదవడం రాలేదు. మరికొంత మంది ఎక్కాలు చదవలేకపోయారు. దీంతో హరీశ్​రావు అసంతృప్తి చెందారు. కరోనా తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే పరిస్థితుల వల్లే పిల్లలు అలా మారారని టీచర్లు చెప్తున్నారు.

బేసిక్స్ మర్చిపోయిన్రు
గత విద్యాసంవత్సరం ప్రైమరీ స్టూడెంట్లకు ఆఫ్​లైన్, ఆన్ లైన్ పాఠాలు చెప్పలేదు. దీంతో వాళ్లంతా బేసిక్స్ మర్చిపోయారు. రెండేండ్ల కింద ఫస్ట్ క్లాసులో చేరిన వాళ్లు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నారు. గతేడాది వాళ్లు ఒక్కరోజు కూడా బడికి పోలేదు. ఆన్ లైన్ పాఠాలూ లేవు. దీంతో చాలామంది అఆ లు, ఏబీసీడీలు రాయలేక, చదవలేకపోతున్నారు. మెజార్టీ ప్రైమరీ స్టూడెంట్లందరిదీ ఇదే పరిస్థితి. దీంతో అందరికీ అఆ..ల నుంచి మళ్లీ మొదలుపెట్టారు. ఇంటి దగ్గర పేరెంట్స్ చదువు చెప్పిన పిల్లలు కాస్త బెటర్​గా ఉన్నారు. హైస్కూల్​లెవెల్​లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు క్లాస్​రూముల్లో చెప్తేనే అంతంత అర్థమవుతాయని.. అలాంటింది టీవీలు, ఆన్​లైన్​లో చెప్తే అర్థమవడం కష్టమని టీచర్లు చెప్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా చాలా స్కూళ్లల్లో స్టూడెంట్లందరికీ మళ్లీ ఫస్ట్ నుంచి పాఠాలు మొదలుపెట్టామన్నారు. పలు జిల్లాల్లో పిల్లల్ని ఏ, బీ కేటగిరీలు చేసి చెప్తున్నారు. ఇంకొన్ని జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ (చదవడం, రాయడం, లెక్కించడం) విధానాన్ని అమలు చేస్తున్నారు. 

అటెండెన్స్ 70 శాతం పెంచాలని టార్గెట్​
ఈ నెల ఫస్ట్ నుంచి ప్రారంభమైన ఫిజికల్ క్లాసులకు 30 శాతం వరకే స్టూడెంట్లు అటెండ్ అవుతున్నారు. దీన్ని కనీసం 70 శాతానికి పెంచాలని విద్యా శాఖ అధికారులు, టీచర్లు కసరత్తు చేస్తున్నారు. పిల్లలు బడికి వచ్చేలా, వచ్చిన వాళ్లు రెగ్యులర్​గా క్లాస్​కు అటెండయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ముందు వారికి పాఠాలు కాకుండా బేసిక్స్ చెబుతున్నారు. ఆటపాటలతో క్లాసులు నిర్వహిస్తున్నారు.