ప్రైవేటు బడులకు పిల్లలొస్తలే

ప్రైవేటు బడులకు పిల్లలొస్తలే
  • ప్రైవేటు బడులకు పిల్లలొస్తలే
  • రీ ఓపెన్ చేసి నెలదాటినా 32 లక్షల స్టూడెంట్లకు 12 లక్షల మంది మాత్రమే వస్తున్నరు 
  • 718 బడులు ఇప్పటకీ ఓపెన్ కాలే 
  • ఫీజులు, కరోనా భయంతోనే అంటున్న మేనేజ్ మెంట్లు 
  • మొత్తంగా స్కూళ్లకు పోతున్నది 50 శాతం స్టూడెంట్లే

హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లను సర్కారు రీ ఓపెన్ చేసి నెలరోజులు దాటుతున్నా స్టూడెంట్లు పూర్తి స్థాయిలో క్లాసులకు అటెండ్ కావట్లేదు. ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌వెట్టి, సెప్టెంబరు 1 నుంచి ఫిజికల్ క్లాసులు షురూ చేసినా సగం మంది స్టూడెంట్లు కూడా బడిబాట పట్టలేదు. రాష్ట్రంలో 26 వేలకుపైగా ఉన్న సర్కారు బడులను రీ ఓపెన్‌ చేసింది. క్లాసులు స్టార్ట్‌ చేసినప్పుడు తక్కువగా ఉన్న స్టూడెంట్ల అటెండెన్స్‌ మెల్లమెల్లగా పెరుగుతోంది. నెలరోజుల తరువాత సర్కారు బడుల్లో స్టూడెంట్ల అటెండెన్స్‌ 67 శాతానికి చేరింది. అయితే కొన్ని ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్ ఇప్పటికీ రీ ఓపెన్‌ కాలేదు. 

10 వేల స్కూల్స్‌.. 32 లక్షల మంది స్టూడెంట్స్..
రాష్ట్రంలో మొత్తం 10,816 ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌ ఉన్నాయి. వాటిలో సుమారు 32.05 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో కేవలం 12.67 (39%) లక్షల మంది మాత్రమే శుక్రవారం స్కూల్స్‌కు అటెండయ్యారు. ప్రైవేటు బడుల్లో ఫస్ట్‌ డే ఫిజికల్ క్లాసులకు 18 శాతం మంది స్టూడెంట్లు హాజరుకాగా.. నెలరోజులకు అది 39 శాతానికి పెరిగింది. అటెండెన్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా.. సర్కారు బడులతో పోలిస్తే ప్రైవేటులో క్లాసులకు చాలా తక్కువమంది అటెండ్‌ అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి పేరెంట్స్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ భయంతో పాటు, ఫీజుల భయం కూడా కారణమని తెలుస్తోంది. కేవలం పది జిల్లాల్లో మాత్రమే 50 శాతం కంటే ఎక్కువ మంది స్టూడెంట్లు అటెండ్ అవుతున్నారు. కరీంనగర్, మేడ్చల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో స్టూడెంట్ల అటెండెన్స్ 30 శాతంలోపే ఉంది. సర్కారు బడులకు 67 శాతం మంది స్టూడెంట్లు వస్తుండగా.. ఎయిడెడ్​స్కూళ్లకు మాత్రం 38.86 శాతం మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు. ప్రైవేటు, ఎయిడెడ్‌తో పోలిస్తే.. సర్కారు బడుల్లో  హాజరు శాతం ఎక్కువ ఉండటం గమనార్హం. 

65 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఓపెన్‌ కాలే..
 ఫిజికల్ క్లాసులు స్టార్ట్‌ చేసి నెలరోజులు గడిచినా ఇప్పటికీ రాష్ట్రంలోని 718 స్కూల్స్ రీఓపెన్ కాలేదు. 653 ప్రైవేటు, 65 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఈ లిస్టులో ఉన్నాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ వ్యాప్తి చెందుతుందనే ప్రచారం జరగుతుండడమే ఇందుకు కారణమని స్కూళ్ల మేనేజ్‌మెంట్లు చెబుతున్నాయి. థర్డ్‌ వేవ్‌ వస్తే నెలరోజుల క్లాసులకు ఏడాది ఫీజు కట్టాలనే ఆందోళనలో పేరెంట్స్ ఉన్నారని అంటున్నారు. దసరా సెలవుల తర్వాత అన్ని స్కూల్స్ రీఓపెన్ అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రైమరీ స్కూల్స్‌ రీ ఓపెన్ కాలేదని అంటున్నారు. అలాగే దసరా తరువాత స్టూడెంట్ల అటెండెన్స్ పెరిగే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. .