ఎల్కతుర్తి, వెలుగు : కడుపున పుట్టిన పిల్లలు వృద్ధాప్యంలో తన బాగోగులు పట్టించుకోవడం లేదని ఆస్తిని పంచాయతీకి రాసిచ్చాడో వృద్ధుడు. గ్రామస్తుల సమక్షంలో పేపర్ పై రాసి సంతకం చేసి అందించాడు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన నాగిళ్ల కోనయ్య కొన్నేండ్లుగా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో పౌరోహిత్యం చేసేవాడు.
అప్పట్లో కోనయ్యకు గ్రామ పెద్దలు 4.38 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చాడు. ఆ తర్వాత అతని కొడుకు నాగిళ్ల వెంకటేశ్వర్లు శర్మ పౌరోహిత్యాన్ని కొనసాగించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొన్నాళ్ల కింద భార్య చనిపోయింది.
వృద్ధాప్యంలో ఉన్న అతనిని పిల్లలు చూడకపోతుండడంతో భూమి పంచాయతీకి దానంగా ఇచ్చేందుకు నిర్ణయించాడు. గురువారం గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ లెటర్ ప్యాడ్ పేపర్ పై రాసి సంతకం చేసి ఇచ్చాడు. గ్రామస్తులే తన సంరక్షణ చూసుకుంటున్నారని, అందుకే తన ఆస్తిని పంచాయతీకి రాసి ఇచ్చినట్టు వృద్ధుడు వెంకటేశ్వర్లు శర్మ తెలిపాడు. కాగా పూజారి నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
