చదువుల ఖర్చు డబుల్​

చదువుల ఖర్చు డబుల్​
  • కట్టలేక తిప్పలు పడుతున్న పేరెంట్స్​
  • స్కూల్​ను బట్టి రూ. 30 వేల నుంచి 5 లక్షల దాకా ఫీజులు
  • పెరిగిన బుక్స్​, యూనిఫాం రేట్లు.. ట్రాన్స్​పోర్టు చార్జీలూ రెండింతలు 
  • సంపాదనలో సగానికిపైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు
  • ఫీజుల నియంత్రణను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ఎల్​కేజీ చదివే పిల్లలకే లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తున్నది. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో ఏదైనా బెంగ ఉన్నదంటే.. అది పిల్లల చదువులు, వాళ్ల ఫీజుల గురించే. ఎంత చిన్న స్కూల్​ అయినా సరే రూ. 30 వేలకు తక్కువ ఫీజు లేదు. పిల్లల పుస్తకాలు, డ్రెస్సులు, ట్రాన్స్​పోర్టు, ఇతర ఖర్చులు కలిపితే ఆ ఖర్చు డబుల్​ అవుతున్నది. కాస్త పెద్ద స్కూల్​లో రూ. లక్షకు పైగా ఫీజులుంటే.. కార్పొరేట్​ స్కూల్​లో  ఐదు లక్షల రూపాయల వరకు ఉంది. కరోనా తర్వాత స్కూలు ఫీజులు మొదలు ప్రతి ఒక్క ఖర్చు పెరిగింది. స్కూల్​ ఫీజులు 20 నుంచి 50 శాతం, బుక్స్​, స్టేషనరీ ఖర్చు 50 నుంచి 70 శాతం, ట్రాన్స్​పోర్టు ఖర్చు 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. మొత్తంగా పేరెంట్స్​పై గతంలో కన్నా డబుల్​ భారం పడుతున్నది. పేరెంట్స్​ తమ జీతంలో సగం కన్నా ఎక్కువే పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. తక్కువలో తక్కువ  నెలకు రూ. 13 వేల నుంచి 15 వేలు పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తున్నది.  

రెండేండ్లు పెంచలేదనీ..!
కరోనా వల్ల రెండేండ్లు బడులు తెరచుకోలేదు. దీంతో స్కూల్స్​ యాజమాన్యాలకు ఆదాయం లేకుండా పోయింది. ఆ కరవునంతా ఈ సంవత్సరం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది. రెండేండ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే ఈ విద్యాసంవత్సరంలో  ఫీజులు డబుల్​ అయ్యాయి. బడ్జెట్​ స్కూల్​లో గతంలో రూ. 30 వేల ఫీజు ఉంటే ఇప్పుడు రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు. పెద్ద స్కూల్​లో గతంలో రూ. లక్ష  ఫీజు ఉంటే.. ఇప్పుడు రూ. లక్షా 70 వేలకు చేరింది. ఫీజులు ఇంత ఎందుకు పెంచారని పేరెంట్స్​ అడిగితే.. గత రెండేండ్లు తాము ఫీజులు పెంచలేదు కాబట్టి ఈ సారి పెంచాల్సి వస్తున్నదని యాజమాన్యాలు చెప్తున్నాయి. కరోనా వల్ల తాము నష్టపోయామని అంటున్నాయి. స్కూళ్లు ప్రభుత్వ అనుమతితో 10% పెంచుకోవచ్చు. అయితే దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. అయితే వాటిని పక్కన బెట్టి 20 నుంచి 50 శాతంగా ఫీజులు పెంచేశారు.  ఎవరైనా పేరెంట్స్ రెక్వెస్ట్ చేస్తే అసలు ఫీజు, అడ్మిషన్ ఫీజుల్లో కొన్ని స్కూళ్లు కొంత మొత్తాన్ని తగ్గిస్తున్నాయి. కానీ యూనిఫాం, బుక్స్, ట్రాన్స్ పోర్ట్ వాటిల్లో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడో తరగతి చదివే విద్యార్థికి యూనిఫాంకు రూ.4,500, బుక్స్ కు రూ.3,500, బస్సుకు రూ.2,000 వసూలు చేస్తున్నాయి. దీంట్లో ఏ తగ్గేది లేదని కరాఖండీగా చెప్తున్నాయి.

ట్రాన్స్​పోర్ట్ చార్జీలు 50 శాతానికి పైగా పెంపు 
పిల్లల్ని స్కూలుకు పంపేందుకు గాను ట్రాన్స్ పోర్ట్ రూపేణా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తున్నది. కరోనా కంటే ముందుతో పోలిస్తే 50 శాతానికి పైగా చార్జీలు పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. దూరాన్ని బట్టి స్కూల్​ బస్సులకు చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో నెలకు రూ. 1,300 దాకా తీసుకోగా, ఇప్పుడది రూ.2000 అయింది. గతంలో ఆటోలకు రూ. 500 తీసుకునే వాళ్లు ఇప్పుడు వెయ్యి రూపాయలు చార్జ్​ చేస్తున్నారు.  ఫిట్​నెస్ ఫీజు, క్వార్టర్లీ టాక్స్, గ్రీన్ టాక్స్, ఇన్సూరెన్స్ తోపాటు డీజిల్ ధరల పెరుగుదలతో చార్జీలు పెంచాల్సి వచ్చిందని స్కూల్ యజమానులు చెప్తున్నారు. 

జీవో 46 ను అమలు చేయలె
రాష్ట్రంలో 10,800 వరకూ కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లుండగా.. వాటిలో 32.23 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో ఆయా స్కూల్​ స్థాయిని బట్టి ఏటా రూ. 30 వేల నుంచి 5 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. మిగిలిన యూనిఫామ్, బుక్స్, బస్ ఫీజులు తదితర ఫీజులన్నీ వేరే. అయితే 2020–21 అకడమిక్ ఇయర్  కరోనా  ఎఫెక్ట్​తో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ క్లాసులు కొనసాగాయి. ఆ అకడమిక్ ఇయర్ మొదలు కాకముందే.. ఆ ఏడాదికి ఫీజులపై జీవో నంబర్ 46ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. కేవలం ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలి. మిగిలిన ఫీజులు తీసుకోవద్దు. ఫీజులు కూడా నెలవారీగా తీసుకోవాలి.  2021–22లోనూ ఆ జీవోను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఎక్కడా ఆ జీవో అమలు కాలేదు. కొవిడ్ టైమ్​లోనూ భారీగా ఫీజులు వసూలు చేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఫీజులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఫీజుల చట్టం ఏమాయె?
విద్యాసంవత్సరం ప్రారంభమై 10 రోజులు దాటింది. అయినా ఈ ఏడాది ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కారు స్పష్టత ఇవ్వడం లేదు. ఫీజుల నియంత్రణ కోసమని ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో 2017లోనే ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ అన్నీ స్టడీ చేసి సర్కారుకు మూడేండ్ల కిందనే రిపోర్టు ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఆ కమిటీ సిఫారసుల్నీ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. ఫీజుల చట్టం తీసుకొస్తామని ఈ ఏడాది జనవరిలో సర్కారు తెలిపింది. దీనికోసం కేటీఆర్​, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా మొత్తం14 మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా రెండు, మూడు సార్లు సమావేశమై సర్కారుకు నివేదిక అందించింది. దీంట్లో ఏటా పది శాతం ఫీజును మేనేజ్మెంట్లు పెంచుకునేలా ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ రిపోర్టు ఇచ్చి మూడు నెలలు దాటింది. అయినా ఇప్పటికీ నివేదికపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఫీజుల చట్టం తీసుకొచ్చే ఆలోచన లేనట్టే కనిపిస్తున్నది. 

ఫీజులతో ఆగమవుతున్నం
నేను మెకానిక్ గా, నా భార్య వాచ్​ ఉమన్​గా పనిచేస్తున్నం. మా ఇద్దరు పిల్లలకు డొనేషన్ ఫీజు  రూ. 20 వేలు కట్టినం. నర్సరీ చదువుతున్న పాపకి రూ. 15 వేలు, రెండో తరగతి బాబుకి రూ. 30 వేలు కట్టాలని మేనేజ్‌‌మెంట్ చెప్పింది. అవి కాకుండా పుస్తకాలు, స్టేషనరీకి అదనంగా ఇంకో రూ.10 వేలు అయినయ్​.  ఫీజులు చూస్తుంటే ఆగమవుతున్నం. 
- ఈశ్వర్, పేరెంట్, మణికొండ ఓయూ కాలనీ, హైదరాబాద్​

బుక్స్ కే రూ.25 వేలు అయినయ్
మా ఇద్దరు పిల్లల్లో ఒకరు యూకేజీ, మరొకరు ఫస్ట్ క్లాస్. బుక్స్ కోసమే రూ.25 వేలు కట్టినం. ఒక్క బుక్స్ కోసమే ఇంత పెట్టాల్సి రావడంతో ఆశ్చర్యమేసింది. స్కూలు ఫీజులు, అప్లికేషన్ ఫీజులు, యూనిఫామ్స్ చార్జీలు సెపరేట్. ఇట్లయితే పిల్లల్ని ఎట్ల చదివించేది. ఫీజుల నియంత్రణపై సర్కారు దృష్టి పెట్టాలి. 
- సూరెపల్లి అశోక్, పేరెంట్, మన్సూరాబాద్

ఫీజులు డబుల్
మాకు ఇద్దరు పాపలు. ఒక పాప ఏడో తరగతి, ఇంకో పాప నర్సరీ చదువుతున్నరు. గతేడాది ఇద్దరికి రూ. 63 వేల ఫీజు కట్టిన. ఈసారి కొంచెం దూరమైనా చదువు మంచిగా చెప్తారని వేరే స్కూల్​లో జాయిన్ చేసిన. ఇద్దరికి రిజిస్ట్రేషన్ కింద  రూ. 20 వేలు అయింది. ట్యూషన్ ఫీజు చిన్న పాపకు సీబీఎస్‌‌‌‌ఈ సిలబస్ నర్సరీ రూ.47 వేలు, పెద్దమ్మాయి స్టేట్ సిలబస్ ఏడో తరగతి రూ.44 వేలు. ఇవికాక బస్సుకు ఒకరికి రూ. 12 వేలు, ఇంకొకరికి రూ. 15 వేలు. స్టేషనరీ ఫీజులో యాక్సెసరీస్‌‌‌‌కి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, బుక్స్​కు చెరో రూ. 4 వేలు. యూనిఫామ్ కోసం ఇద్దరికి రూ. 5 వేల దాకా అయినయి. స్పోర్ట్స్ యాక్టిటివీస్ కి మరో రూ. 20 వేలు అవుతున్నది. గతేడాదితో పోల్చుకుంటే ఇప్పుడు ఫీజులు డబులైనయ్​. 
- సంధ్య, ఉప్పల్​, హైదరాబాద్​

ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలె
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అందినకాడికి దోచుకుంటున్నయ్. అడ్మిషన్ టైంలోనే 60 శాతం ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. గల్లీకో బ్రాంచ్ ప్రారంభిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. అనుమతులు ఉల్లంఘించినా, అధిక ఫీజులు వసూలు చేసినా అలాంటి సంస్థలపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం చేస్తున్నరు. 
- ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి
ఢిల్లీలో స్కూళ్లు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్​.. ఇక్కడి పేరెంట్స్ సమస్యలు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సర్కారు నియంత్రణ లేదు. దీనిపై కమిటీ వేయాలని హైకోర్టు చెప్పినా ఇప్పటివరకు వేయలేదు. ప్రైవేటు స్కూళ్లను కాపాడే పనిలో ప్రభుత్వం ఉంది. ఫీజుల నియంత్రపై చట్టం చేసి దాన్ని కఠినంగా అమలు చేయాలి. 
- కె.వెంకట్ సాయినాథ్,   హెచ్ఎస్పీఏ నేత