Childrens care: పిల్లలకు ఆహారం ఇలా ఇవ్వాలి.. ఎముకలు గట్టి పడతాయి.. !

Childrens care:    పిల్లలకు ఆహారం ఇలా ఇవ్వాలి.. ఎముకలు గట్టి పడతాయి.. !

ఎదిగే పిల్లలున్న తల్లిదండ్రులు.. ఆహారాన్ని పెట్టేటప్పుడు వాళ్లకు అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా లేదా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్లకు సరిపడా విటమిన్లు ఇస్తున్నామా గమనించాలి. సరైన మోతాదులో విటమిన్ -డి క్యాల్షియం అందకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే లోపాలు కూడా కనిపిస్తుంటాయి. అలా జరగకుండా ఉండేందుకు  పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .!

ఎదిగే పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు ప్రతి దాంట్లోనూ జాగ్రత్త వహించాలి. కేవలం కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు మాత్రమే అందిస్తే సరిపోదు. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడుతాయి. అందులో విటమిన్ - డి. క్యాల్షియం చాలా ముఖ్యమైనవి. పాలు తాగుతున్నారు. కదా... అన్నీ అందుతాయిలే అని సరిపెట్టొద్దు. ఎందుకంటే పిల్లల్లో ఎముకల దృఢత్వం ఈ రెండింటి పైనే ఆధారపడి ఉంటుంది.

కాల్షియం : పిల్లల ఎముకలు, పళ్లు దృఢంగా పెరగాలంటే... వాళ్లకు కచ్చితంగా క్యాల్షియం అవసరం. ఇది ఆ రెండింటికే కాదు. నాడీ వ్యవస్థ, కండరాలు సరిగా పని చేయడానికీ ఉపయోగపడుతుంది. రెండు నుంచి అయిదేళ్ల లోపు పిల్లలకు రోజుకు సగటున 500-1000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం.

విటమిన్ డి : శరీరానికి క్యాల్షియం సరిగా అందాలంటే కచ్చితంగా విటమిన్- డి కావాలి. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తి, కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే ఫ్లూ, జలుబులాంటివి రాకుండా కాపాడుతుంది ఈ విటమిన్- డి.

ఎలాంటి సమస్యలు:పిల్లల్లో విటమిన్ -డి లోపం ఉంటే... శరీరానికి క్యాల్షియం అందక రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల ఎముకలు, పళ్లు బలహీనపడతాయి. అలాగే అవి ఉండాల్సిన ఆకారంలో ఉండవు.అంతేకాకుండా ఈ క్యాల్షియం, విటమిన్- డి సరైన మోతాదులో అందకపోతే, పిల్లల్లో ఎత్తు పెరగడం ఆగిపోతుంది. కొందరు పిల్లల్లో ఎముకలు, కండరాల నొప్పి విపరీతంగా కనిపిస్తుంది. మరికొంతమందిలో ఎముకలు వంగిపోతుంటాయి. వంగిపోతాయి.

 ఏం చేయాలి

పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్, బాదం పప్పును పిల్లలకు ప్రతిరోజూ ఆహారంలో చేర్చాలి. అలాగే రోజుకు 10-15 నిమిషాలు ఎండ (సూర్యరశ్మి)లో తిప్పాలి. అలా చేస్తే వాళ్లకు విటమిన్- డి బాగా అందుతుంది. పూర్తి పౌష్టికాహారం అందించాలంటే, ఆహారంలో అన్ని రకాల ధాన్యాలు (గోధుమ, సజ్జ, జొన్న మొదలైనవి).  పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు తప్పనిసరిగా పెట్టాలి. 2-5 ఏళ్ల పిల్లలకు రోజుకు రెండు గ్లాసుల పాలు అందించాలి. అలాగే ఉదయం పూట ఎండలో ఆటలు ఆడేలా చూడాలి