పిల్లల పతంగి పంచాదీ.. ఇరు కుటుంబాల రాళ్ల దాడి.. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఘటన

పిల్లల పతంగి పంచాదీ.. ఇరు కుటుంబాల రాళ్ల దాడి.. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఘటన
  •     ఆపడానికి వచ్చిన పోలీస్​కు గాయాలు

మెహిదీపట్నం, వెలుగు: పతంగులు ఎగరవేస్తుండగా చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవ.. పెద్దల కొట్లాటకు దారితీసింది. ఏకంగా ఇరు కుటుంబాలు రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లింది. ఈ ఘటనలో ఓ పోలీస్ గాయపడడం గమనార్హం. 

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లంగర్ హౌస్ లోని పెన్షన్ పురాలో హైమద్ అలీ, రహీం పక్కపక్క బిల్డింగుల్లో నివసిస్తున్నారు. వీరిద్దరి పిల్లలు గురువారం సంక్రాంతి పూట పతంగులు ఎగరవేస్తున్నారు. ఒకరి పతంగి దారం మరొకరి బిల్డింగ్​పైకి వచ్చిందని పిల్లలు గొడవపడ్డారు.  దీంతో పిల్లలకు సర్దిచెప్పాల్సింది పోయి పెద్దలు సైతం మాటమాట అనుకొని ఘర్షణ పడ్డారు. 

పండుగ రోజు ఇదంతా జరగగా, మూడు రోజుల తర్వాత ఆదివారం మరోసారి గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా అలాగే గొడవ పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో రాళ్ల దాడిలో హోమ్ గార్డ్ మహ్మద్ అలీముద్దీన్ కిందపడి గాయపడ్డాడు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.