భారత్కు ఎరువులు సప్లై చేస్తం..చైనా మంత్రి హామీ

భారత్కు ఎరువులు సప్లై చేస్తం..చైనా మంత్రి హామీ
  • అరుదైన ఖనిజాలు, టన్నెల్  మెషీన్లు కూడా అందిస్తమని వెల్లడి
  • అమెరికా టారిఫ్​లపైనా చర్చలు
  • వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయం

న్యూఢిల్లీ: భారత్​కు ఎరువులు సప్లై చేస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. యూరియా, ఎన్పీకే, డీఏపీ వంటి ఎరువులతో పాటు అరుదైన ఖనిజాలు, సొరంగాలు తవ్వే మెషీన్లు కూడా అందిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు ఆయన హామీ ఇచ్చారు. భారత్ లో పర్యటిస్తున్న వాంగ్ యీ మంగళవారం జైశంకర్ తో భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య గత కొన్నేండ్లుగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాల లీడర్లు చర్చించారు.

 అలాగే అమెరికా టారిఫ్ లపైనా మాట్లాడుకున్నారు. ఇరు దేశాలపైనా యూఎస్  టారిఫ్ ల నేపథ్యంలో వాణిజ్యం విషయంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తైవాన్  విషయంలో భారత వైఖరి మారదని వాంగ్ యీకి ఈ సందర్భంగా జైశంకర్  స్పష్టం చేశారు. తైవాన్ తో భారత్ కు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా.. జైశంకర్  గత నెలలో చైనాలో పర్యటించారు. 

భారత్ కు యూరియా, అరుదైన ఖనిజాలు, టన్నెల్ మెషీన్లు సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఏడాది పాటు మన దేశానికి చైనా దిగుమతులు నిలిచిపోయాయి. మరోవైపు మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతోనూ వాంగ్ యీ భేటీ అయ్యారు.

సరిహద్దుల వద్ద అంతా ప్రశాంతం: దోవల్

భారత్, చైనా సరిహద్దుల వద్ద అంతా ప్రశాంతంగా ఉందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్  దోవల్  తెలిపారు. దోవల్​తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్  యీ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల వద్ద పరిస్థితులపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఏడాది కాలంగా ఉద్రిక్తతలు తగ్గడంతో రెండు దేశాల బార్డర్ల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొందని, దీంతో ఇరు దేశాలకూ లబ్ధి కలిగిందని దోవల్ అన్నారు. 

గత తొమ్మిది నెలల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయని చెప్పారు. ఈ నెల 31, సెప్టెంబరు 1న చైనాలోని తియాంజిన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని తెలిపారు. నిరుడు రష్యాలో మోదీ, జిన్ పింగ్​ భేటీ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ఈ క్రెడిట్ మోదీ, జిన్ పింగ్​లదే అని పేర్కొన్నారు. 

వాంగ్  యీ మాట్లాడుతూ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బార్డర్​ వివాదాలు తొలగిపోయి, సంబంధాలు మెరుగవడం ఆనందంగా ఉందన్నారు.