భూటాన్ భూభాగంలో చైైనా అక్రమ కట్టడాలు..శాటిలైట్ ఫోటోలతో బట్టబయలైన చైనా దురాగతం

భూటాన్ భూభాగంలో చైైనా అక్రమ కట్టడాలు..శాటిలైట్ ఫోటోలతో బట్టబయలైన చైనా దురాగతం

టిబెట్, భూటాన్ భూభాగాల్లో గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్న చైనా 

న్యూఢిల్లీ: ఈస్టర్న్ లడఖ్  బార్డర్ లో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్న వేళ… టిబెట్, భూటాన్ బార్డర్ లో చైనా గుట్టుగా నిర్మాణాలు చేపడుతోంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీని తప్పుదోవ పట్టిస్తూ.. రెండో గ్రామం నిర్మాణ పనులు చేప్టటింది. అమో చు నది వెంబడి భూటాన్ టెర్రిటరీలోకి చొరబడి .. నిర్మాణ పనులను చేపట్టినట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వెల్లడైంది. చలికాలం తర్వాత కూడా ఇండియాతో బార్డర్ లో టెన్షన్ పరిస్థితులను చైనా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇండియాకు కీలకమైన డోక్లామ్

2017 మార్చి లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) డోక్లామ్ లో భూటాన్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది. మన దేశంపైనా వ్యూహాత్మకంగా బెదిరింపులకు పాల్పడింది. భూటాన్ మనకు మిత్రదేశం కావడం, వ్యూహాత్మకంగా ఇది కీలక ప్రాంతం కావడంతో మన ఆర్మీ జోక్యం చేసుకుంది. షర్షింగ్మా (యతుంగ్ వ్యాలీ)లోకి రాకుండా చైనా ఆర్మీని అడ్డుకుంది. అయితే ప్రస్తుతం అమో చు రివర్ వెంబడి భూటాన్ భూభాగంలోకి చొరబడిన చైనా.. నిర్మాణాలు కొనసాగిస్తోంది. భూటాన్  భూభాగంలో ఒక విలేజ్, రోడ్డు నిర్మాణాలను చేపట్టినట్టు అమెరికాకు చెందిన మక్సర్ టెక్నాలజీస్ అక్టోబర్ 28న విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బయటపడింది.

హద్దులు దాటిన చైనా

డోక్లామ్ లో ఉద్రిక్తత సమయంలో మన దేశం కొన్ని రెడ్ లైన్స్ ను ఏర్పాటు చేసి.. వీటిని క్రాస్ చేయొద్దని చైనాకు స్పష్టం చేసింది. అయితే ఈ రెడ్ లైన్స్ ను దాటి వచ్చిన చైనా..  అమో చు రివర్​పై బ్రిడ్జిని, రోడ్డును నిర్మించినట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తేలింది. ఈ బ్రిడ్జి న్యూ పంగ్డా ఫేజ్ 1 విలేజ్ కు 400 మీటర్ల దూరంలో ఉందని, 40 నుంచి 45 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఉన్నట్టు గుర్తించారు. ఇది అమో చు రివర్ తూర్పు, పడమర ఒడ్డులను కనెక్ట్ చేస్తుంది. భూటాన్ టెరిటరీలోకి చొరబడి అమో చు నది పడమర తీరంలో 30 ఇండ్లతో పండా ఫేజ్ 1 విలేజ్ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ జనం నివసించేందుకు అవకాశం లేదని, చైనా ఆర్మీ ఈ గ్రామాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా నిర్మిస్తున్న 2 గ్రామాలు, రోడ్డు సిలిగురి ఈస్టర్న్ బైపాస్ (జల్పాయ్ గురి బ్రిడ్జిలకు)కు 70 కి.మీ. దూరంలోనే ఉన్నాయి. మన దేశానికి వ్యూహాత్మకంగా ఉన్న ఏహెచ్ 2 రోడ్డుకు ఇది ముప్పుగా మారనుంది.