చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. డైలీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో రికార్డ్ అవుతున్నాయి. రోజుకు సగటున 9వేల మంది కరోనాతో మృతి చెందుతున్నట్లు ఓ హెల్త్ డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. ఒక్క డిసెంబర్ లోనే లక్షమంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. జనవరిలో 34 లక్షల రోజువారీ కేసులు నమోదవుతాయని తెలిపింది. చైనాలో కరోనా కేసుల గణాంకాలపై ఇతర దేశాలు విమర్శలు చేస్తున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలను చైనా దాచిపెడుతుందంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా కేసులను దాచి పెట్టడంతో సమస్య మరింత తీవ్రం అవుతోందని ఆస్ట్రేలియాలోని ఓ పత్రిక ప్రచురించింది. మార్చి నాటికి కనీసం వంద కోట్ల మంది వైరస్ బారిన పడవచ్చని ఇప్పటికే పలు ఆరోగ్య విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. చైనాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా పలు దేశాలు చైనాపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతివ్వనున్నట్లు పెర్కొన్నాయి. మరోవైపు కరోనా కేసులను దాచి పెట్టడంపై ఇప్పటికే WHO అధికారులు చైనాకు పలు ఆదేశాలు జారీ చేశారు. మరణాల వివరాలు, పాజిటివ్ కేసుల సంఖ్య, హాస్పిటల్ లో చేరుతున్నవారి గణాంకాలు ఇవ్వాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను కోరింది.