తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు పెంచనున్న  చైనా.. 

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు పెంచనున్న  చైనా.. 

చైనా ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. అలాంటి దేశం పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తే ఎవరు మాత్రం వద్దంటారు. అలాంటి చైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నా.. ఓ దేశం మాత్రం దాన్ని రిసీవ్​ చేసుకునే పరిస్థితిలో లేదట. ఇంతకు ఆ దేశం ఏదనుకుంటున్నారా.. అదేనండీ తాలిబన్ల వశమైన ఆఫ్గనిస్తాన్. ఇప్పటికే చైనా ఆ దేశంలో అనేక పెట్టుబడులు పెట్టింది.

తాలిబన్ల రాజ్యంలో చైనా తన పెట్టుబడుల సంఖ్య ను పెంచాలనుకుంటుండగా.. అది అంత ఈజీ కాదని అమెరికాకు చెందిన ఓ సంస్థ నివేదించింది. అందులోని వివరాల ప్రకారం..  చైనా కంపెనీలు బెల్ట్​ అండ్​ రోడ్​ ఇనిషియేటివ్​ కింద ఆఫ్గనిస్తాన్​లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. కానీ టెర్రరిజం, అస్థిరత కారణంగా కంపెనీ ప్రతినిధులు భయపడుతున్నారని వాయిస్​ ఆఫ్​అమెరికా నివేదిక వెల్లడించింది.  గత వారం, కాబూల్‌లో తాలిబాన్ అధికారులతో జరిగిన సమావేశంలో, ఫ్యాన్ చైనా ఆఫ్ఘన్ మైనింగ్ ప్రాసెసింగ్.. ట్రేడింగ్ కో అధికారులు ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్మాణం, ఆరోగ్యం, శక్తి తదితర రంగాలలో  350 మిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ కంపెనీ చైనాకు చెందిన జిన్‌జియాంగ్ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్ గ్యాస్ కో, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వాటన్ గ్రూప్‌ల మధ్య జాయింట్ వెంచర్.  2023 జనవరిలో, తాలిబాన్ రాజ్యంలో ఉత్తరాన చమురును వెలికితీసేందుకు సీఏపీఈఐసీతో ఒప్పందంపై సంతకం చేసింది.  ఆఫ్ఘనిస్తాన్‌లో గనుల అభివృద్ధి, నిర్వహణపై చైనా కూడా ఆసక్తి చూపింది. ఒక చైనీస్ కంపెనీ, మెటలర్జికల్ కార్పొరేషన్ ఆఫ్ చైనా, లోగర్ ప్రావిన్స్‌లోని మెస్ ఐనాక్ నుండి రాగిని తీయడానికి 2008లో అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ పని ఇంతవరకు ప్రారంభం కాలేదు.

ALSO READ :కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఎం

గత నెలలో, తాలిబాన్ మైనింగ్,  పెట్రోలియం మంత్రి, షహబుద్దీన్ డెలావర్, గని అభివృద్ధి, నిర్వహణ పనులు ప్రారంభించాలని ఎంసీసీని కోరారు.  చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించే ఒప్పందంలో తాలిబాన్ దౌత్యపరమైన విజయం సాధించిందని విశ్లేషకులు చెప్పారు. అయితే ప్రాజెక్ట్ అమలు ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కుంటోంది.  ఇలా ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ఆఫ్గన్​లో చైనా కొత్తగా పెట్టుబడులు పెట్టడంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.